Share News

HLC : నీటి వనరు కన్నీరు

ABN , Publish Date - Jun 28 , 2024 | 12:30 AM

ఉమ్మడి జిల్లాకు ప్రధాన నీటివనరు తుంగభద్ర ఎగువ కాలవ. దీని నిర్వహణను వైసీపీ హయాంలో గాలికి వదిలేశారు. మరమ్మతు పనులను కూడా పైసా ఇవ్వలేదు. సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశాల్లో మాత్రం ప్రగల్భాలు పలికారు. జిల్లాలోనే అతిపెద్ద రిజర్వాయర్‌ అయిన పీఏబీఆర్‌ హెచ్చెల్సీ పరిధిలోనే ఉంది. దీని సామర్థ్యం 11 టీఎంసీలు. కానీ ఎన్నడూ పూర్తిస్థాయిలో నిల్వ చేయలేదు. కారణం.. నిర్వహణా లోపం. ఎంపీఆర్‌ డ్యాందీ అదే పరిస్థితి. హెచఎల్‌ఎంసీ ఆధునికీకరణను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. హెచ్చెల్సీ లింక్‌ ..

HLC : నీటి వనరు కన్నీరు
Dilapidated HCLMC

కలగానే పీఏబీఆర్‌లో పూర్తిస్థాయి నీటి నిల్వ

టీబీ డ్యాం నీరు వదిలితే.. హెచ్చెల్సీకి గండ్లు

మరమ్మతులకు నిధులివ్వని జగన సర్కారు

హెచఎల్‌ఎంసీ ఆధునికీకరణ ప్రతిపాదనకే పరిమితం

కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న రైతులు

ఉమ్మడి జిల్లాకు ప్రధాన నీటివనరు తుంగభద్ర ఎగువ కాలవ. దీని నిర్వహణను వైసీపీ హయాంలో గాలికి వదిలేశారు. మరమ్మతు పనులను కూడా పైసా ఇవ్వలేదు. సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశాల్లో మాత్రం ప్రగల్భాలు పలికారు. జిల్లాలోనే అతిపెద్ద రిజర్వాయర్‌ అయిన పీఏబీఆర్‌ హెచ్చెల్సీ పరిధిలోనే ఉంది. దీని సామర్థ్యం 11 టీఎంసీలు. కానీ ఎన్నడూ పూర్తిస్థాయిలో నిల్వ చేయలేదు. కారణం.. నిర్వహణా లోపం. ఎంపీఆర్‌ డ్యాందీ అదే పరిస్థితి. హెచఎల్‌ఎంసీ ఆధునికీకరణను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. హెచ్చెల్సీ లింక్‌ చానల్‌కు సంబంధించిన కాలవలను పటిష్టపరిచి, సామర్థ్యం పెంచాల్సి ఉన్నా.. పట్టించుకోలేదు. హై లెవెల్‌ మెయిన కెనాల్‌ (హెచఎల్‌ఎంసీ) 189 కి.మీ. మోపిడి వద్ద పీఏబీఆర్‌కు 11 కి.మీ. మేర లింక్‌ చానల్‌ శిథిలావస్థకు చేరింది. దీన్ని


పూర్తిస్థాయిలో సరిచేసేందుకు రూ.74 కోట్లు అవసరమని ఇంజనీరింగ్‌ అధికారులు అంచనా వేశారు. నాలుగేళ్లుగా హెచ్చెల్సీ అధికారులు వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వాటిని చెత్తబుట్టలో పడేస్తూవచ్చారు. ఈ లింక్‌ చానల్‌ పూర్తి కాకపోతే సాగునీటితో పాటు అనంతపురం నగరానికి తాగునీటికి సైతం కష్టాలు తప్పవని ఇంజనీర్లు చెబుతున్నారు. హెచ్చెల్సీ శిథిలావస్థలకు చేరిన కారణంగా టీబీ డ్యాం నుంచి నీటిని వదిలిన ప్రతిసారీ గండ్లు పడుతున్నాయి. నీరు వృథా అవుతోంది.

- అనంతపురం క్లాక్‌టవర్‌

సొంతానికి సోకులు

హెచ్చెల్సీకి జిల్లా కేంద్రంలో కార్యాలయమే లేదు. అయినా వైసీపీ హయాంలో ఏ ఒక్క ప్రజాప్రతినిధీ పట్టించుకోలేదు. కానీ తమ పార్టీ జిల్లా కార్యాలయానికి మాత్రం హెచ్చెల్సీ స్థలం రెండు ఎకరాలను కేటాయించుకున్నారు. నిర్మాణ పనులను వేగంగా కొనసాగించారు. అదే హెచ్చెల్సీ స్థలంలో జలవనరుల శాఖ సీఈ, ఎస్‌ఈ కార్యాలయాలకు స్థలం కేటాయించినా.. ఒక్క అడుగూ ముందుకుపడలేదు. సుమారు 20 ఎకరాలకు పైగా సొంత స్థలం ఉన్నా.. కార్యాలయ భవనం నిర్మించుకోలేని దుస్థితిలో హెచ్చెల్సీ శాఖ ఉంది. తెలుగుతల్లి కూడలిలో ఉన్న హెచ్చెల్సీ ఎస్‌ఈ కార్యాలయాన్ని రెండున్నర్లే క్రితం ఖాళీ చేయించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి విస్తరణ కోసం దీన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో హెచ్చెల్సీ కాలనీలో ఎస్‌ఈ కార్యాలయాన్ని ఒక చోట, డిప్యూటీ ఎస్‌ఈ ఒక చోట కేటాయించారు. సిబ్బంది, రికార్డుల కోసం ఒక గదిని కేటాయించారు. జలవనరుల శాఖ సీఈ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని రెండెకరాల విస్తీర్ణంలో ప్రహరీ ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఒక్క అడుగూ ముందుకు పడలేదు.


రద్దు చేసి.. వదిలేశారు..

హెచ్చెల్సీ ఆధునికీకరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2008-09లో రూ.458 కోట్లతో హెచఎల్‌ఎంసీ ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. 2018 వరకు రూ.310 కోట్ల పనులు జరిగాయి. మిగిలిన రూ.148 కోట్ల పనులను వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే రద్దు చేశారు. ఆ పనులను కొనసాగించి ఉంటే ఇప్పటికి పూర్తి అయ్యేవి. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ.148 కోట్లతో పూర్తి కావాల్సిన పనులు కాస్తా రూ.500 కోట్లకు చేరాయని హెచ్చెల్సీ అధికారులు, ఇంజనీర్లు, నిపుణులు అంటున్నారు. ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తే 2600 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కాలవను 4200 క్యూసెక్కులకు పెంచుకోవచ్చు. దీంతో టీబీ డ్యాంలో వరద నీటిని అదనంగా జిల్లాకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

నీటిని నిల్వ చేసేదెన్నడు..?

జిల్లాలో అతిపెద్ద రిజర్వాయరు.. పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌. దీని నీటి నిల్వ సామర్థ్యం 11 టీఎంసీలు. కానీ ఇప్పటి ఆ స్థాయిలో ఎప్పుడూ నీటిని నిల్వ చేయలేదు. పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలంటే మిగిలిన భూసేకరణ చేపట్టాలి. ఆ మేరకు నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. పీఏబీఆర్‌ నీటి నిల్వ సామర్థ్యం అంచనా వేసేందుకు రూ.5కోట్లు అవసరమని సీడబ్యూసీ పూణెకు చెందిన కంపెనీ తెలిపింది. 11 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి మరో రూ.450 కోట్లు అవసరం. వైసీపీ ప్రభుత్వం వీటి గురించి పట్టించుకోలేదు. వరద నీటిని నిల్వ ఉంచేందుకు ఉంతకల్లు రిజర్వాయర్‌ నిర్మాణ డీపీఆర్‌కు రూ.4.8కోట్లు అవసరం. దీన్ని కూడా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఇలా అడుగడుగునా హెచ్చెల్సీని నిర్వీర్యం చేసింది.


పీఏబీఆర్‌ సామర్థ్యం పెంచాలి..

పీఏబీఆర్‌ గరిష్ఠ సామర్థ్యం మేరకు నీటిని నింపాలి. పీఏబీఆర్‌ కింద మాకు మూడెకరాల ఆయకట్టు ఉంది. నీరు తక్కువగా ఉండడంతో వరి, ఇతర పంటలు వేయనీయడం లేదు. ఆరుతడి పంటలే పెట్టమంటున్నారు. నీటి నిల్వలు పూర్తిస్థాయిలో ఉండే పంటలు బాగా పండిచి అభివృద్ధి చెందుతాం. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం పీఏబీఆర్‌పై దృష్టి సారించాలి. డ్యాంను పటిష్టపరచాలని రైతుల తరఫున కోరుతున్నాం. హెచ్చెల్సీ అధికారులను, కలెక్టర్లను ఐదేళ్ళలో పలుమార్లు కలిశాం. ఎటువంటి ఉపయోగం లేదు.

- కురుబ సంగప్ప, రైతు, జల్లిపల్లి

స్పందన లేదు

హెచ్చెల్సీ పరిధిలోని పనులకు ప్రతిపాదనలు పంపినా స్పందన రావడం లేదు. గడిచిన ఐదేళ్ళలో హెచ్చెల్సీ ఆధునికీకరణ, పీఏబీఆర్‌ పటిష్టత, మోపిడి వద్ద ఉన్న లింక్‌చానల్‌, ఇతర మరమ్మతులు, వివిధ నిర్మాణాలకు నాలుగు దఫాలుగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాము. ఒక్క ప్రతిపాదనకూ స్పందన రాలేదు. హెచ్చెల్సీ మరమ్మతులు, పహారాకు అవసరమైన నిధుల కోసం ఎన్నోసార్లు అడిగినా పట్టించుకోలేదు. పూర్తిస్థాయిలో నిధులు ఇస్తే కాలవ పటిష్టత, రిజర్వాయర్ల సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. టీబీ డ్యాం నుంచి వచ్చే నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసుకుని సద్వినియోగం చేసుకుంటే జిల్లా సస్యశ్యామలం అవుతుంది. - రాజశేఖర్‌, హెచ్చెల్సీ ఎస్‌ఈ


మరిన్ని ఆనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 28 , 2024 | 12:30 AM