Share News

Amaravati: అమ్మ జోగీ.. ఇలా దోచేశారా..!?

ABN , Publish Date - Aug 13 , 2024 | 02:03 PM

ఏసీబీ దాడులతో మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమాల పుట్ట బద్ధలవుతోంది. ఆయన దోపిడీ యవ్వారం అంతా బట్టబయలవుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

Amaravati: అమ్మ జోగీ.. ఇలా దోచేశారా..!?
Jogi Ramesh

అమరావతి: ఏసీబీ దాడులతో మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమాల పుట్ట బద్ధలవుతోంది. ఆయన దోపిడీ యవ్వారం అంతా బట్టబయలవుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు రికార్డులు, డాక్యూమెంట్లను పరిశీలించిన అధికారులు.. వివిధ రూపాల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ భూములను ఆయన కాజేసినట్లు గుర్తించారు. భూ అక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.


అగ్రిగోల్డ్ భూముల ఆక్రమ.. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్-జోగి కుటుంబం..!

  • విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములను తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి కాజేశారు.

  • సర్వే నెం.88లోని 2160 చ.గ. భూమిని జోగి రమేష్‌ కుమారుడు జోగి రాజు, రమేష్‌ బాబాయ్‌ జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేశారు.

  • కొనుగోలు చేసిన భూమి రికార్డులు తారుమారు చేసి సర్వే నెంబరు కూడా మార్చేశారు.

  • సర్వే నెం.88లోని భూమిని కొని దానిని సర్వే నెం.87లోకి మార్చాలంటూ రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి తీసుకొచ్చారు.

  • జోగి బాబాయ్, తనయుడి పేరిట 29.04.2023న స్వీయ దిద్దుబాటు దస్తావేజులంటూ దొంగ పత్రాలు సృష్టించారు.

  • అదే భూమిని తేది: 31.05.2023న పడిగిపాటి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించారు.

  • గ్రామ సర్వేయర్‌ దేదీప్య ఎటువంటి సర్వే నిర్వహించకముందే సర్వే చేసినట్లు దొంగ రికార్డులు సృష్టించారు.

  • సర్వే సమయంలో సరిహద్దు దారులైన అద్దేపల్లి కిరణ్‌, రాంబాబులకు నోటీసులు ఇచ్చి వాళ్లు కూడా నిర్థారించినట్లు కట్టుకథలు అల్లారు.

  • అయితే, జోగి కుటుంబ అక్రమాలపై అగ్రిగోల్డ్‌ సంస్థ ఫిర్యాదుతో దొంక కదిలింది.

  • పూర్తి ఆధారాలతోనే ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టి.. జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేశారు.


అయితే, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ దాడులు చేయడానికి రెవెన్యూ నివేదిక కారణంగా తెలుస్తోంది. రెవెన్యూకు దొరకకుండా, రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి తెచ్చి జోగి రమేష్ చక్రం తిప్పినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకుండా పోలీసులపైనా ఒత్తిడి తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జోగి బండారం అంతా బహిర్గతమైంది.


అసలు వివాదం ఏంటి?

విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ వ్యవహారంలోనే జోగి కుటుంబానికి ఉచ్చు బిగిస్తోంది. ఈ భూముల వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయిని సంవత్సరం క్రితమే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఫిర్యాదును అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటవడంతో.. జోగి అక్రమాలు బయటపడుతున్నాయి.


అంబాపురంలో సర్వే నెంబర్ 88లో అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 2,160 గజాల భూమి ఉంది. అగ్రిగోల్డ్ కేసు వ్యవహారంలో ఈ భూమిని సీఐడీ గతంలోనే అటాచ్ చేసింది. అయితే, నాటి మంత్రి జోగి రమేష్ తన అధికారాన్ని అడ్డంపెట్టుకుని.. భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నకిలీ రిజిస్ట్రేషన్ వేరే వారిపై చేసి.. మళ్లీ తమ కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయించేందుకు జోగి రమేష్ కుట్ర పన్నారు. ఇదే విషయాన్ని రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు.


జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, రమేష్ సోదరుడు జోగి వెంకటేశ్వర రావు వేరే వారి దగ్గర నుంచి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని.. మళ్ళీ ఈ స్థలాన్ని విజయవాడకు చెందిన వేరే వారికి అమ్మివేశారు జోగి బ్రదర్స్. తమపై నెపం రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, సీఐడీ తనఖాలో ఉన్న స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేశారనే అంశంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతి, ABN వరుస కథనాలు ప్రచురించగా.. అధికారుల్లో చలనం మొదలైంది. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి మంత్రి జోగి రమేష్ ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆయన వత్తిడితోనే స్థలం రిజిస్ట్రేషన్ జరిగిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కాగా, మొత్తం రూ. 7 కోట్లు విలువైన స్థలం కబ్జా అయ్యిందని లెక్క తేల్చారు అధికారులు.


అగ్రిగోల్డ్ భూమి కొనుగోలు కేసులో నిందితుల వివరాలు..

1. జోగి రాజీవ్

2. జోగి సోదరుడు వెంకటేశ్వరరావు

3. అడుసుమిల్లి మోహన రంగ దాసు

4. వెంకట సీతామహాలక్ష్మీ

5. సర్వేయర్ దేదీప్య

6. మండల సర్వేయర్ రమేశ్

7. డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్

8. విజయవాడ రూరల్ MRO జాహ్నవి

9. విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులుగా అధికారులు తెలిపారు.

ఈ కేసులో ఇప్పటికే మాజీ మత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 13 , 2024 | 02:41 PM