AP News: జోగి ఎక్కడ? హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల వేట..!
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:21 PM
ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఎక్కడ? నందిగాం సురేష్ అరెస్ట్‌తో భయపడ్డారా? ఆ భయంతోనే ఆయన ఏపీ నుంచి పారిపోయారా? అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్‌లో తలదాచుకున్నారా? అంటే అవుననే అంటున్నారు ఖాకీలు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే నందిగాం సురేష్‌ను..
అమరావతి, సెప్టెంబర్ 05: ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఎక్కడ? నందిగాం సురేష్ అరెస్ట్‌తో భయపడ్డారా? ఆ భయంతోనే ఆయన ఏపీ నుంచి పారిపోయారా? అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్‌లో తలదాచుకున్నారా? అంటే అవుననే అంటున్నారు ఖాకీలు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే నందిగాం సురేష్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. జోగి రమేష్ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్, అతని అనుచరుల కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మూడు ప్రత్యేక బృందాలతో మాజీ మంత్రి కోసం గాలిస్తున్నారు పోలీసులు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మంత్రి జోగి రమేష్ తన అనుచరులతో కలిసి చంద్రబాబు నివాసంపై దాడి చేసేందుకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారున పోలీసులు. తాజాగా ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు జోగి రమేష్‌ను, ఆయన అనుచరులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్, అమీర్‌పేట్‌లోని ఆయన నివాసాల్లో గాలిస్తున్నారు. దీంతో పాటు.. ఇతర రాష్ట్రాల్లోనూ జోగి రమేష్ కోసం గాలింపు చేపట్టారు ఏపీ పోలీసులు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాసాలపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలపై కేసు నమోదైనప్పటికీ.. అధికారబలంతో విచారణను పక్కకు పెట్టేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ కేసు విచారణలో స్పీడ్ పెరిగింది. ఈ దాడులకు సంబంధించి పక్కా ఆధారాలు ఉండటంతో నిందితులందరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే, ఈ రెండు కేసుల్లో తమను అరెస్ట్ చేయొద్దంటూ నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే, వీరి అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.