Share News

NDA Alliance : బీద.. సానా.. ఆర్‌.కృష్ణయ్య!

ABN , Publish Date - Dec 03 , 2024 | 04:25 AM

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఎన్డీయే కూటమి కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. బీద మస్తాన్‌రావు, సానా సతీశ్‌, ఆర్‌.కృష్ణయ్యలను బరిలోకి దింపనున్నట్లు తెలిసింది. మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

NDA Alliance : బీద.. సానా.. ఆర్‌.కృష్ణయ్య!

  • మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కూటమి కసరత్తు కొలిక్కి

  • టీడీపీ నుంచి మస్తాన్‌రావు, సతీశ్‌..

  • బీజేపీ నుంచి బరిలోకి ఆర్‌.కృష్ణయ్య?

  • మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కూటమి కసరత్తు కొలిక్కి

అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఎన్డీయే కూటమి కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. బీద మస్తాన్‌రావు, సానా సతీశ్‌, ఆర్‌.కృష్ణయ్యలను బరిలోకి దింపనున్నట్లు తెలిసింది. మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 10వ తేదీ వరకూ నామినేషన్లకు గడువు ఉంటుంది. వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీల రాజీనామాలతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాజీనామా చేసిన ముగ్గురు ఎంపీల్లో మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావు టీడీపీలో చేరగా.. ఆర్‌.కృష్ణయ్య బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం ఉంది. వీరిలో మస్తాన్‌రావు, సతీశ్‌ను టీడీపీ నుంచి, కృష్ణయ్యను బీజేపీ నుంచి బరిలో నిలపబోతున్నట్లు సమాచారం. పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే బీద, కృష్ణయ్యలు రాజీనామా చేయగా.. మోపిదేవి పదవీ కాలం ఒకటిన్నర ఏడాది మాత్రమే మిగిలి ఉంది.

మోపిదేవి స్థానంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పార్టీ నేత సానా సతీశ్‌ను నిలపాలని టీడీపీ అధినాయకత్వం యోచిస్తోంది. సతీశ్‌ను ఇటీవలి ఎన్నికల్లో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలపాలని పార్టీ భావించింది. కానీ పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. సతీశ్‌ ఎంపికపై పార్టీ అధినేత చంద్రబాబు ఒకరిద్దరు పార్టీ ముఖ్య నేతలకు సంకే తం ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా అండగా ఉన్నవారికి అవకాశాలు ఇవ్వాల్సి ఉందని ఆయన వారితో అన్నట్లు తెలిసింది. కాగా, మరోవైపు ఆర్‌.కృష్ణయ్యను తమ పార్టీ తరఫున నిలపబోతున్నట్లు బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే టీడీపీ నాయకత్వానికి సమాచారం ఇచ్చింది.


  • జనసేనకు ఈసారి లేనట్లేనా?

మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును జనసేన ఆశించింది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన సోదరుడు నాగబాబును పెద్దల సభకు పంపాలన్న యోచనలో ఉన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఆయన దీని పై బీజేపీ నాయకత్వాన్ని కూడా సంప్రదించినట్లు ప్ర చారం జరిగింది. ఆ పార్టీ కోటా కింద వచ్చిన సీటును తమకు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కానీ బీజేపీ నాయకత్వం సుముఖంగా ఉన్నట్లు లేదు. దీంతో టీడీపీ నాయకత్వాన్ని పవన్‌ రాజ్యసభ సీటు కోసం కోరే అవకాశం ఉందా? అనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ వర్గాలు మాత్రం జనసేన నాయకత్వం నుంచి తమకు ఇంతవరకూ ఎలాంటి ప్రతిపాదన రాలేదని అంటున్నాయి. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Dec 03 , 2024 | 04:25 AM