TDP: హామీలు నెరవేర్చడమే చంద్రబాబు ధ్యేయం
ABN , Publish Date - Nov 02 , 2024 | 01:56 AM
ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ఽధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళుతున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.
గుడిపాల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ఽధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళుతున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. దీపం-2 కింద మహిళలకు ఉచిత వంట గ్యాస్ పంపిణీ కార్యక్రమం గుడిపాల మండలం నరహరిపేట జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో శుక్రవారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ మంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.మహిళలకు సిలిండర్లు పంపిణీ చేశాక మంత్రి మాట్లాడుతూ ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా జిల్లాలోని 5.43 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. వంట గ్యాస్ డెలివరీ అయిన 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ నగదు జమవుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలను కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యేలు జగన్మోహన్, మురళీమోహన్, థామస్ మాట్లాడుతూ కలసికట్టుగా పనిచేసి చిత్తూరు జిల్లాకు పరిశ్రమలు తీసుకు వచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చామే తప్ప, దోచుకోవడానికి రాలేదని చెప్పారు. ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్వో శంకరన్, తహసీల్దారు చంద్రశేఖరరెడ్డి, ఎంపీడీవో శివరాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యేలు ఏఎస్ మనోహర్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.
మా కార్యకర్తలను టచ్ చేసిన వాళ్ళను వదలబోం
కూటమి పార్టీల కార్యకర్తలను టచ్ చేసినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి చెప్పారు.
గుడిపాలలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడమే కాక దాడులు చేయించారన్నారు.తమకు అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా ప్రజలకు ప్రశాంతమైన పాలన అందిస్తున్నామన్నారు.అయితే గతంలో తప్పుచేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. , టీడీపీ నాయకులు సి.ఆర్. రాజన్,కాజూరు బాలాజి,పీటర్, హేమలత, బాలాజీ నాయుడు,మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు, చెన్నకేశవులు నాయుడు,బాలాజి నాయుడు, నాగరాజ్ యాదవ్, జయదేవ నాయుడు, సుబ్రహ్మణ్య యాదవ్, హేమంత్ నాయుడు, అనిల్, సుమతి, మురళి,మురళీనాయుడు, హరిబాబు, ఉదయ, చల్లా, శంకర్ చౌదరి, శరత్, అయ్యప్ప, జనసేన నాయకుడు రూప్‌కుమార్, బీజేపీ అధ్యక్షుడు ధనంజయ నాయుడు తదితరులు పాల్గొన్నారు.