Sanskrit University: సంస్కృత వర్సిటీలో డ్రగ్స్ కలకలం!
ABN , Publish Date - Nov 23 , 2024 | 12:20 AM
జాతీయ సంస్కృత యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగింది. వర్సిటీ గరుడాచలం హాస్టల్లోని ఓ గదిలో డ్రగ్స్ ఉన్నాయంటూ వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు గణేష్ నేతృత్వంలో నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కూపీ లాగుతున్న పోలీసులు
తిరుపతి (విశ్వవిద్యాలయాలు) నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జాతీయ సంస్కృత యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగింది. వర్సిటీ గరుడాచలం హాస్టల్లోని ఓ గదిలో డ్రగ్స్ ఉన్నాయంటూ వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు గణేష్ నేతృత్వంలో నాయకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చర్యలు తీసుకోవాలని వీసీ ప్రొఫెసర్ కృష్ణమూర్తిని డిమాండ్ చేశారు. దీనిపై వర్సిటీ అధికారులు ఆరా తీస్తున్నారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే పోలీసులు ప్రాథమిక వివరాలను కొంతవరకు సేకరించినట్టు తెలుస్తోంది.
ఆరోపణలు ఇలా..
వర్సిటీలోని గరుడాచల హాస్టల్లో ఒడిశాకు చెందిన ఓ ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థి వద్ద 20 డ్రగ్స్ ప్యాకెట్లు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్న మరో విద్యార్థికి 14 ప్యాకెట్లను అందజేసినట్లు ఆరోపిస్తున్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులకు వాటిని అందజేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏబీవీపీ నేత గణేష్ ఈ మేరకు ఆరోపించారు.
అసలేం జరిగింది?
యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగడంతో యూనివర్సిటీ డ్రగ్స్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. అసలు ఏం జరిగిందంటూ వీసీ ప్రొఫెసర్ కృష్ణమూర్తి, రిజిస్ట్రార్ రమాశ్రీ తదితరులు డ్రగ్స్ కమిటీ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోపణలు వస్తున్న హాస్టల్ సిబ్బంది, విద్యార్థులను విచారించినట్లు చెప్పారు. చీఫ్ వార్డెన్‌ను పిలిపించి మాట్లాడారు. అంతా అబద్ధమని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమాశ్రీ కొట్టి పారేశారు.
డాగ్ స్క్వాడ్‌తో వాస్తవాలు నిగ్గుతేలుతాయా?
డాగ్ స్క్వాడ్ ద్వారా విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల తిరుపతి రైల్వే స్టేషన్లో 22 కేజీల డ్రగ్స్ ప్యాకెట్లు డాగ్ స్క్వాడ్ ద్వారా దొరకడంతో ఇదే తరహాలో తనిఖీ చేయించాలనే అభిప్రాయం వినిపిస్తోంది. దీనివల్ల భవిష్యత్లులో వర్సిటీలో డ్రగ్స్ అనవాళ్లు లేకుండా చేయవచ్చని యూనివర్సిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.