youtube : యూట్యూబ్‌లో చూసి
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:39 AM
నకిలీ నోట్లు ఎలా ముద్రించాలి?’ అనేది యూట్యూబ్‌లో చూశారు. ఆ ప్రకారం వస్తువులు తీసుకొచ్చి ముద్రణ చేపట్టారు. వీటిని చెలామణి చేసే క్రమంలో పట్టుబడ్డారు.
నిందితుల్లో ఒకరు శ్రీకాకుళం జిల్లావాసి
కారు, వస్తువుల సహా నోట్లు స్వాధీనం
పుత్తూరు టౌన్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘నకిలీ నోట్లు ఎలా ముద్రించాలి?’ అనేది యూట్యూబ్‌లో చూశారు. ఆ ప్రకారం వస్తువులు తీసుకొచ్చి ముద్రణ చేపట్టారు. వీటిని చెలామణి చేసే క్రమంలో పట్టుబడ్డారు. నిందితులను తిరుపతి జిల్లా పుత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఆదివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మునికృష్ణారావుకు ఫేస్‌బుక్ ద్వారా తిరుపతిలోని రమే్‌షతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి రమేష్ ఇంట్లో షేర్ మార్కెట్ బిజినెస్ చేసేవారు. ఇందులో నష్టాలు వచ్చాయి. దీంతో డబ్బు సంపాదనకు అడ్డమార్గం ఎన్నుకున్నారు. కరెన్సీ నోట్లను ముద్రించే విధానాన్ని యూట్యూబ్‌లో తెలుసుకున్నారు. దీనికి రమేష్ భార్య సంధ్య, కుమార్తె ఇషా తోడయ్యారు. వీరు నలుగురు తిరుపతిలోనే నోట్ల ముద్రణకు కావాల్సిన వస్తువులను కొని ఇంట్లోనే ముద్రించేవారు. ఆ దొంగ నోట్లతో శ్రీకాళహస్తి, తిరుపతి, రేణిగుంట, పుత్తూరులో వస్తువులను కొనుగోలు చేస్తూ మార్చేవారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం రమేష్, ఇషా పుత్తూరు పట్టణం మండివీధిలోని నిర్మల ప్రొవిజన్ స్టోర్, జగన్నాథం ప్రొవిజన్ స్టోర్, శ్రీకృష్ణ స్టోర్స్, శంకర్ దుకాణాలు వంటి పలు దుకాణాల్లో తమ వద్ద నున్న రూ.500 నోట్లతో పలు వస్తువులను కొనుగోలు చేశారు. వారిచ్చిన నోట్లను ఒక దుకాణాదారుడు కరెన్సీ యంత్రంలో లెక్కించగా అది దొంగనోట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పుత్తూరు సీఐ సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది ఆ దుకాణం వద్దకు వెళ్లి సీసీ కెమెరా ద్వారా దొంగనోట్లను ఇచ్చిన వారిని గుర్తించారు.
వీరు మరో దుకాణంలో వస్తువులు కొనుగోలు చేస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించారు. తిరుపతి, చెర్లోపల్లె సర్కిల్‌లో ఒక ఇంట్లో నోట్లను ముద్రిస్తున్నట్లు చెప్పడంతో, పోలీసులు ఆ ఇంట్లో సోదాలు నిర్వహించారు. నోట్ల ముద్రణకు కావాల్సి వస్తువులు, ప్రింటర్లు, ల్యామినేషన్ యంత్రం, స్ర్కీన్ ప్రింటింగ్, కలర్ లిక్విడ్స్, కట్ చేయడానికి సిద్ధంగా ఉన్న 192 రూ.వంద నోట్ల షీట్లు, 156 రూ.ఐదువందల నోట్ల షీట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎస్‌ఐ ఓబులయ్య, పోలీసులు పాల్గొన్నారు.