Reactor Explosion: ఎసెన్సియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతులు వీరే..!
ABN , Publish Date - Aug 21 , 2024 | 07:02 PM
రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ముగ్గురు మృతిచెందగా.. దాదాపు 25మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు పూడి మోహన్ (20), సీహెచ్ హారిక(22), వై.చిన్నారావు(32)గా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన అనకాపల్లిలోని పలు ఆస్పత్రులకు తరలించారు.
అనకాపల్లి: రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ముగ్గురు మృతిచెందగా.. దాదాపు 25మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు పూడి మోహన్ (20), సీహెచ్ హారిక(22), వై.చిన్నారావు(32)గా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన అనకాపల్లిలోని పలు ఆస్పత్రులకు తరలించారు.
ఎన్టీఆర్ ఆస్పత్రిలో శ్రీనివాస్ వర్మ, జి.చైతన్య, కె.సత్యనారాయణ, పి.మోహన్ సతీశ్ చికిత్స పొందుతున్నారు. అలాగే ఉషా ప్రైమ్ ప్రైవేట్ ఆస్పత్రిలో 11మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పేలుడు దాటికి పరిశ్రమలో కార్మికుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మరికొన్ని భాగాలు అయితే సమీపంలో ఉన్న చెట్టుపై పడ్డాయి.
అయితే భారీ పేలుడుకు మంటలు ఎగసిపడుతున్నాయి. దీని వల్ల పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగ దట్టంగా కమ్ముకుంది. పొగ వల్ల మృతుల సంఖ్య స్పష్టంగా తెలియడం లేదని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ తెలిపారు. రియాక్టర్ పేలడం వల్ల శకలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉండొచ్చన్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
రియాక్టర్ పేలిన ఘటనపై ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో ఫోన్‍లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో పలువురు చనిపోవడం బాధాకరం అని ఎమ్మెల్యే అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాద సందర్భంగా ఎన్డీఆప్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు, శరీర భాగాల కోసం రెస్యూ టీమ్స్ వెతుకుతున్నాయి.