Share News

AP Politics: జగన్‌‌ అలసిపోయారు.. ఇంటికి పంపిద్దాం.. వంగవీటి రాధా షాకింగ్ కామెంట్స్..

ABN , Publish Date - May 03 , 2024 | 04:29 PM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM YS Jagan) బటన్ నొక్కీ.. నొక్కీ అలసిపోయారని.. మే 13వ తేదీన బటన్ నొక్కి ఆయన్ను ఇంటికి పంపిద్దామని వంగవీటి రాధాకృష్ణ(Vangaveeti Radha Krishna) ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు గుంటూరు(Guntur) జిల్లా కేంద్రంలోని వెడ్డింగ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్డీయే కూటమికి చెందిన కాపు నేతలు ..

AP Politics: జగన్‌‌ అలసిపోయారు.. ఇంటికి పంపిద్దాం.. వంగవీటి రాధా షాకింగ్ కామెంట్స్..
Vangaveeti Radhakrishna

గుంటూరు, మే 03: ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM YS Jagan) బటన్ నొక్కీ.. నొక్కీ అలసిపోయారని.. మే 13వ తేదీన బటన్ నొక్కి ఆయన్ను ఇంటికి పంపిద్దామని వంగవీటి రాధాకృష్ణ(Vangaveeti Radha Krishna) ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు గుంటూరు(Guntur) జిల్లా కేంద్రంలోని వెడ్డింగ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్డీయే కూటమికి చెందిన కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూటమి అభ్యర్థుల విజయం కోసం పని చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన వంగవీటి రాధాకృష్ణ.. సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.


‘మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవటం మన చేతుల్లోనే ఉంది. బటన్ నొక్కి జగన్ అలసిపోయారు. ఈ నెల 13వ తేదీన బటన్ నొక్కి జగన్ రెడ్డిని ఇంటికి పంపిద్దాం. కులాన్ని స్వార్థం కోసం వాడుకుని పదవులు పొందితే కొంతకాలమే ఉంటుంది. వంగవీటి రంగా మాత్రం ప్రజల కోసం నిలబడటం వల్లే ప్రజల గుండెల్లో ఉన్నారు.’ అని చెప్పుకొచ్చారు రాధా. ఇదే సమయంలో పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు వంగవీటి రాధాకృష్ణ.


ఓట్లు చీలకూడదని పవన్ కల్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నారని వంగవీటి చెప్పారు. జగన్ రెడ్డి సిద్ధం అంటే జనసైనికులు సై అంటున్నారని.. కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యత అందరం తీసుకుందామని రాధా పిలుపునిచ్చారు. ఈ ప్రాంత సమస్యలను గల్లా జయదేవ్ పార్లమెంటులో వినిపించారని.. అదే విధంగా ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ ముందుకు వచ్చారన్నారు. ఆగిపోయిన అమరావతి నిర్మాణం ముందుకు సాగాలంటే పెమ్మసాని గెలవాలని అన్నారు.


అలాగే, గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న గల్లా మాధవిని గెలిపించాలని కాపు నేతలకు పిలుపునిచ్చారు వంగవీటి రాధా. విశ్రాంత ఐఏఎస్ బూర్ల రామాంజనేయులు ప్రత్తిపాడు నుంచి పోటీ చేస్తున్నారని.. టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలన్న నినాదాన్ని చాటిచెప్పాలన్నారు. ‘చేయి చేయి కలుపు.. చేజారదు గెలుపు అన్న వంగవీటి రంగా మాటలు గుర్తు చేస్తున్నా.. కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే వచ్చే ఐదేళ్లు వారు మన సమస్యలు పరిష్కరిస్తారు. మీరు చూపించే అభిమానం ఈనెల 13న ఓటురూపంలో ఉండాలని కోరుతున్నా.’ అంటూ కాపు నేతలను వంగవీటి రాధా విజ్ఞప్తి చేశారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 03 , 2024 | 04:29 PM