Share News

Ayyannapatrudu: ఏడుసార్లు అసెంబ్లీకి, నాలుగుసార్లు మంత్రిగా

ABN , Publish Date - Jun 22 , 2024 | 12:33 PM

వరహలు దొర దంపతులకు చింతకాయల అయ్యన్నపాత్రుడు 1957 సెప్టెంబర్ 4వ తేదీన విశాఖపట్టణం జిల్లా నర్సిపట్నంలో జన్మించారు. ప్రాథమిక విద్య నర్సిపట్నంలో జరిగింది. కాకినాడ పీఆర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పద్మావతితో అయ్యన్నపాత్రుడికి వివాహమైంది. విజయ్, అజయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

Ayyannapatrudu: ఏడుసార్లు అసెంబ్లీకి, నాలుగుసార్లు మంత్రిగా
Chintakayala Ayyannapatrudu

హైదరాబాద్: భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు సీఎంగా, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. సభలో ముఖ్యమైన పదవి స్పీకర్.. ఆ పోస్ట్‌ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని వరించింది. సీనియారిటికి ప్రాధాన్యం ఇచ్చి స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. అయ్యన్నపాత్రుడు ఒక్కరే స్పీకర్ పోస్ట్‌కు అప్లై చేయడంతో ఏకగ్రీవమైంది. చింతకాయల అయ్యన్నపాత్రుడు నేపథ్యం ఏంటి..? తెలుగుదేశం పార్టీలో ఆయన క్రియాశీలక నేతగా ఎలా ఎదిగారు. ఇప్పటికే కీలకమైన మంత్రి పదవులు చేపట్టి.. మరో అడుగు ముందుకేసి స్పీకర్ చైర్‌లో ఆశీనులయ్యారు.


ఇదీ నేపథ్యం..

వరహలు దొర దంపతులకు చింతకాయల అయ్యన్నపాత్రుడు 1957 సెప్టెంబర్ 4వ తేదీన విశాఖపట్టణం జిల్లా నర్సిపట్నంలో జన్మించారు. ప్రాథమిక విద్య నర్సిపట్నంలో జరిగింది. కాకినాడ పీఆర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పద్మావతితో అయ్యన్నపాత్రుడికి వివాహమైంది. విజయ్, అజయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.


రాజకీయ ప్రస్థానం

నందమూరి తారక రామారావు పిలుపుతో చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారు. 1983లో నర్సీపట్నం అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసింది లేదు. ఇప్పటివరకు పదిసార్లు పోటీ చేయగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలోనే మంత్రిగా పనిచేశారు. నర్సీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నెలకొల్పారు. డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేశారు. 1983, 1985లో నర్సీపట్నం నుంచి వరసగా రెండుసార్లు గెలుపొందారు. 1989లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణమూర్తి రాజు చేతిలో ఓడిపోయారు. 1994, 1999, 2004లో వరసగా మూడుసార్లు గెలుపొందారు. 2009లో బోలెం ముత్యాల పాప చేతిలో ఓడిపోయారు. 2014లో అయ్యన్నపాత్రుడు గెలుపొందారు. 2019లో పెట్ల ఉమా శంకర్ గణేశ్ చేతిలో ఓటమి పాలయ్యారు. గత ప్రభుత్వం అయ్యన్నపాత్రుడిని ఇబ్బందికి గురిచేసింది. ఈ సారి గెలువడంతో ఏడుసార్లు నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచినట్టు అయ్యింది.


మంత్రిగా నాలుగుసార్లు

నాలుగుసార్లు మంత్రి పదవులను చేపట్టారు అయ్యన్నపాత్రుడు. 1984లో విద్యాశాఖ మంత్రిగా, 1994లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంలో ప్రతి రోడ్డును తారు రోడ్డుగా మార్చారు. 1996లో అనకాపల్లి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు. 1999లో చంద్రబాబు హయాంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ ఔషధ మొక్కల పంపకం కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. 2014లో కూడా మంత్రిగా పనిచేశారు. ఈ సారి స్పీకర్ పదవి చేపట్టి.. ఆ పదవికే వన్నె తీసుకొస్తారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రులు, ఎమ్మెల్యేలు అభిప్రాయ పడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అయ్యన్నపాత్రుడు పాటు పడ్డారు.

Updated Date - Jun 22 , 2024 | 12:33 PM