Share News

CM Chandrababu: కష్టాల్లో ఉన్నది మన కుటుంబమే: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 03 , 2024 | 12:40 PM

వరద సహాయక చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు అంతా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వాటిల్లొద్దని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.

CM Chandrababu: కష్టాల్లో ఉన్నది మన కుటుంబమే: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి: వరద సహాయక చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రులు, ఉన్నతాధికారులు అంతా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వాటిల్లొద్దని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం నుంచి జరిగిన ఆహారం పంపిణీ వివరాలను అధికారులను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. 5 హెలీకాఫ్టర్ల ద్వారా ఆహారం పంపిణీ జరుగుతుందని అధికారులు వివరించారు. హెలికాఫ్టర్, పడవ, ట్రాక్టర్ల ద్వారా ఉదయం నుంచి ఆహారం, నీళ్లు అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.


floods.jpg


హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం

‘5 లక్షల ఆహారం, నీళ్ళ ప్యాకెట్లు సిద్ధం చేసి పంపిణీ జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేని చోటకు హెలికాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలి. మూడు పూటలా ఆహారం అందించాలి. విజయవాడలో 36 డివిజన్లలో విధుల్లో ఉన్న అధికారులే ఆహార పంపణీకి బాధ్యత వహించాలి. క్షేత్ర స్థాయిలో ఆహారం అందింది లేనిది నిర్ధారించుకోవాలి. రెండు రోజులు వరదలో చిక్కుకుని ఆహారం, నీరు లేక పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థ చేసుకుని అధికారులు పనిచేయాలి. మన కుటుంబమే అలాంటి కష్టంలో ఉందనే ఆలోచనతో పనిచేయాలి. నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి అని’ అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


chandrababu-drone.jpg


సహాయక చర్యల్లో తెలుగు తమ్ముళ్లు

విజయవాడలో వరద బాధితులకు సహాయక చర్యలను మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షిస్తున్నారు. ‘ఆరు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, త్రాగునీరు సరఫరా. బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీకి ప్రత్యేక హెలికాప్టర్‌లో 2,500 ఆహార పొట్లాలు. విజయవాడ పరిధిలో వరద ముంపునకు గురైన 32 వార్డుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న సహాయక చర్యలు. మంత్రి లోకేశ్ పిలుపు మేరకు సహాయ చర్యల్లో రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ చేరుకున్న పార్టీ శ్రేణులు. విజయవాడ డివిజన్ పరిధిలో 70 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న 14,452 మంది నిరాశ్రయులు. వరద బాధితులకు ఆహారం, మంచి నీరు అందజేస్తున్నాం అని’ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద వరద నీరు వేగంగా తగ్గుతోంది. ప్రస్తుతం వరద ప్రవాహం 8,71,776 క్యూసెక్కులుగా ఉంది.


lokesh.jpg

Updated Date - Sep 03 , 2024 | 12:40 PM