Share News

CM Chandrababu: గురు కనకదాస జయంతి శుభాకాంక్షలు తెలిసిన సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Nov 18 , 2024 | 05:30 PM

రాయలసీమలోనూ కులవ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త గురు కనకదాస అని ఏపీ సీఎం చంద్రబాబు కీర్తించారు. బీసీలను, వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని ఏళ్ల కిందటే ఆయన చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు.

CM Chandrababu: గురు కనకదాస జయంతి శుభాకాంక్షలు తెలిసిన సీఎం చంద్రబాబు..
AP CM Chandrababu Naidu

అమరావతి: సంఘ సంస్కర్త, కవి, గాయకుడు, కృష్ణతత్వ భక్త అగ్రగణ్యుడు శ్రీ గురు కనకదాస జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు కొనియాడారు. కర్ణాటకలో జన్మించిన గురు కనకదాస.. దేశంలో పాతుకుపోయిన కుల వివక్షపై పోరాటం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు.


రాయలసీమలోనూ కులవ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త కనకదాస అని చంద్రబాబు కీర్తించారు. బీసీలను, వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ.. వారి ఉన్నతి కోసం ప్రతిఒక్కరూ పని చేయాల్సిన అవసరం గుర్తుచేసిన మహనీయుడు ఆయన అని ముఖ్యమంత్రి కొనియాడారు. భక్తి మార్గంలో ఆయన చేసిన బోధనలు నేటికీ అనుసరణీయం, ఆదర్శనీయమని చెప్పుకొచ్చారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో ఎన్నో ఏళ్ల కిందటే గురు కనకదాస బోధనలు చేశారని సీఎం చెప్పారు.


గురు కనకదాస బోధనలు నేటి సమాజానికీ మార్గదర్శనం చేస్తున్నాయంటే ఆ మహనీయుడి దార్శనికతను అర్థం చేసుకోవచ్చని ఎక్స్ వేదికగా చంద్రబాబు తెలిపారు. శ్రీ గురు కనకదాస బోధనలు సమాజాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు దోహదపడతాయని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే కనకదాస జయంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


మరోవైపు సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నిన్న(ఆదివారం) నారావారిపల్లెలో జరిగాయి. ఈ కార్యక్రమం అనంతరం ఇవాళ(సోమవారం) మంత్రి నారా లోకేశ్‌తో కలిసి రేణిగుంట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు గన్నవరానికి బయలుదేరారు. అయితే మంత్రి లోకేశ్ మాత్రం కుటుంబసభ్యులతో కలిసి మరో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి మాత్రం ఈనెల 28 వరకూ నారావారిపల్లెలోనే ఉండనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

TTD: స్వామివారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. సంచలన నిర్ణయాలు ఇవే..

Former Minister Roja: ఏపీలో హిట్లర్, గడాఫి కలిసి పాలన చేస్తున్నట్లు ఉంది: ఆర్కే రోజా..

Updated Date - Nov 18 , 2024 | 05:43 PM