AP Politics: జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి.. జగన్‌పై హాట్ కామెంట్స్
ABN , Publish Date - Feb 04 , 2024 | 07:42 PM
ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి(Vallabhaneni Balasouri ) అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో బాలశౌరి పార్టీలో చేరారు.
అమరావతి: వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎంపీ బాలశౌరి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. చేరిక అనంతరం సభలో మాట్లాడిన బాలశౌరి.. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదన్నారు. జనసేనలోకి వచ్చినందుకు ఆనందంతో తనకు ఊపిరి ఆడటం లేదన్నారు. వైఎస్సార్ హయాంలో ఎంపీగా చేసినప్పుడు తనకు చాలా తృప్తిని ఇచ్చిందని తెలిపారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేక పోయామని చెప్పారు.
దమ్మున్న పవన్!
పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని బాలశౌరి మండిపడ్డారు. దమ్ము, దైర్యంతో గొంతు ఎత్తే వ్యక్తి పవన్ అని చెప్పుకొచ్చారు. పవన్‌తోనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో పవన్ ఉన్నారు కనుకే రాష్ట్రంలో కొద్దో.. గొప్పో ప్రజాస్వామ్యం అమలు అవుతోందన్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్నారు. జగన్ ప్రభుత్వం టెండర్ పిలిస్తే ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. అమరావతి రాజధానికి ప్రతిపక్షంలో ఉండగా జగన్ సంపూర్ణ మద్దతు ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు.
వైసీపీ.. ఆ విషయాలు తెలుసు
రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి 2019లో ఓట్లు అడిగింది గుర్తులేదా..? అని ఎంపీ ప్రశ్నించారు. 2024లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారో జగన్ చెప్పాలని నిలదీశారు. వందల కోట్లు పెట్టీ ‘‘సిద్ధం’’ మీటింగ్‌లు, హోల్డింగ్స్ పెడుతున్నారని.. ఇంతకీ వైసీపీ దేనికి ‘‘సిద్ధం’’..? పారిపోవడానికి ‘‘సిద్ధ’’మా..? అని సెటైర్లేశారు. దేవుడు జగన్ ఒక్కరికే కాదు.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, సునీతకు కూడా ఉన్నారని.. అన్ని చూస్తున్నాడని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీలో జరిగినవన్నీ తనకు తెలుసన్నారు. రానున్న రోజుల్లో అన్నీ వివరిస్తానని ఆయన అన్నారు. తన పెదన్నయ్య చిరంజీవికి అన్ని అవార్డులు వచ్చాయని.. భారతరత్నమాత్రమే మిగిలి ఉందని అన్నారు. తన శ్రేయస్సు కోరుకునే వ్యక్తి తన చిరంజీవి అని చెప్పారు. తన రాజకీయ జీవితం ఇకపై పవన్ కళ్యాణ్‌తోనే అని ఎంపీ తెలిపారు. పార్టీలో తనకు ఏ బాధ్యత ఇచ్చినా ఒక సైనికుడిలా పని చేస్తానని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. కాగా.. బాలశౌరి సభకు వేలాది మంది తరలి వచ్చారు. ఎంపీ మాట్లాడుతున్నంత ఈలలు, కేకలు, నినాదాలతో అభిమానులు హోరెత్తించారు.