Share News

Home Minister Anitha : వైసీపీ కవ్వింపులకు రెచ్చిపోవద్దు

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:45 AM

సైకో పాలనలో అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు, పవన్‌ కల్యాణే ఇబ్బంది పడ్డారని, వారే అతిపెద్ద బాధితులని హోం మంత్రి అనిత అన్నారు. జగన్‌ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలే కాదు..

Home Minister Anitha : వైసీపీ కవ్వింపులకు రెచ్చిపోవద్దు

  • చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు

  • బాబు, పవన్‌ మన కంటే పెద్ద బాధితులు

  • అందరూ సంయమనంగా ఉండాలి

  • టీడీపీ, జనసేన శ్రేణులకు హోంమంత్రి పిలుపు

అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): సైకో పాలనలో అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు, పవన్‌ కల్యాణే ఇబ్బంది పడ్డారని, వారే అతిపెద్ద బాధితులని హోం మంత్రి అనిత అన్నారు. జగన్‌ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలే కాదు.. సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఆ అరాచక పాలనకు ముగింపు పలికిన జనం.. ఇప్పుడు మనకు అధికారం ఇచ్చారని, వైసీపీ కవ్వింపు చర్యలతో రెచ్చిపోకుండా సంయమనం పాటించాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు.

గురువారమిక్కడ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అరాచక శక్తులు అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. వైసీపీ వాళ్లు రెచ్చగొడుతున్నా.. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే పని చేయొద్దని కూటమి శ్రేణులను కోరారు. చట్టపరంగానే అరాచక శక్తులను అణచివేస్తామన్నారు. ‘గడచిన ఐదేళ్లలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. ఇంకా గాడిన పడని డిపార్ట్‌మెంట్‌ను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.

ఇటీవల జరుగుతున్న ఘటనలకు గత ప్రభుత్వ విధ్యంసం తాలుకా అవశేషాలే మూలాలు’ అని చెప్పారు. శాంతి భద్రతలు సరిదిద్దేందుకు కొంతసమయం పడుతుందని, చంద్రబాబు ప్రభుత్వం వీలైనంత త్వరలో సరిచేస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. టీడీపీ, జనసేన కార్యకర్తలే కాకుండా నేతలు అంతకంటే ఎక్కువ వేధింపులకు గురయ్యారని..


చంద్రబాబును మరీ ఎక్కువగా బాధించారని గుర్తు చేశారు. బాధ్యులపై చట్టపరంగా చర్యలుంటాయన్నారు. ‘టీడీపీ, జనసేన కార్యకర్తల ఆవేదన అర్థం చేసుకున్నాం. అయితే మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. చంద్రబాబు పాలన అంటేనే శాంతిభద్రతలకు భరోసా అని దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టవద్దు’ అని సూచించారు. గత ఐదేళ్లలో చేసిన అరాచకాల్లో ఒక్కటి కూడా ఉపేక్షించేది లేదని చెప్పారు.

బాబాయి హత్యపై జగన్‌ లేఖ రాయాలి..

రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి వైసీపీ అధ్యక్షుడు జగన్‌ లేఖ రాయడంపై అనిత స్పందించారు. సొంత చిన్నాన్న వివేకా హత్య, ఎమ్మెల్సీ అనంత్‌ బాబు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని డోర్‌ డెలివరీ లాంటిపైనా లేఖ రాస్తే మంచిదని హితవు పలికారు. జగన్‌లాగా చంద్రబాబు వాడిని చంపు.. వీడిని చంపు అనే నాయకుడు కాదన్నారు. అధికారం కోసం సొంత చిన్నాన్న రక్తాన్ని ఆయనకు పూసేందుకు ప్రయత్నించిన జగన్‌.. కోడికత్తి డ్రామా తరహాలో గులక రాయి డ్రామాను రక్తి కట్టించలేక పోయారని ఎద్దేవా చేశారు.

Updated Date - Jul 19 , 2024 | 05:45 AM