రెండోరోజు సీఐడీ విచారణ
ABN , Publish Date - Aug 27 , 2024 | 11:40 PM
మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో సీఐడీ అధికారులు రెండోరోజు మంగళవారం కూడా విచారణ కొనసాగించారు. సోమవారం రాత్రి సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆఽధ్వర్యంలో సీఐడీ అధికారులు సబ్‌కలెక్టరేట్‌లో విచారణ చేశారు.
సీఐడీ డీఎస్పీ ఆధ్వర్యంలో నివేదికలు
మదనపల్లె టౌన్, ఆగస్టు 27: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో సీఐడీ అధికారులు రెండోరోజు మంగళవారం కూడా విచారణ కొనసాగించారు. సోమవారం రాత్రి సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆఽధ్వర్యంలో సీఐడీ అధికారులు సబ్‌కలెక్టరేట్‌లో విచారణ చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏ రమణయ్య, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌తేజతో పాటు ఆర్డీవో హరిప్రసాద్‌ను విడివిడిగా అధికారులు విచారించినట్లు తెలిసింది. దీంతో పాటు ఫైర్ అధికారులను కూడా విచారించారు. ఫైళ్ల దహనం ఘటనలో తొలుత ఎక్కడ నుంచి మంటలు వ్యాపించాయి, ఎంత దూరం వరకు వెళ్లాయి, ఎంతసేపట్లో మంటలను అదుపు చేశారు తదితర వివరాలను సేకరించారు. అనంతరం రాత్రి 12.30 గంటల వరకు వీడియో కవరేజి మధ్య అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సీఐడీ ఉన్నతాధికారులు అక్కడే తిష్ట వేశారు. ఈ తతంగం అంతా జరుగుతున్న సమయంలో ఎవ్వరినీ లోపలికి అనుమతించకుండా సబ్‌కలెక్టరేట్ మెయిన్‌గేట్లు మూసివేసి పోలీసు బందోబస్తు నిర్వహించారు. మంగళవారం ఉదయం యధావిధిగా సబ్ కలెక్టరేట్ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐడీ ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు రాత్రి సేకరించిన వివరాలను కంప్యూటర్‌లో నివేదికల రూపంలోకి మార్చారు. దీంతో పాటు సబ్ కలెక్టరేట్ ఉద్యోగులను కూడా విచారించారు.
అక్రమార్కుల గుండెల్లో అలజడి
మదనపల్లె ఫైళ్ల దహనం కేసు విచారణను సీఐడీ అధికారులు వేగవంతం చేస్తుండటంతో ఫ్రీహోల్డ్ భూముల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డ రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు, వైసీపీ నాయకుల గుండెల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే 8 మందిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు కాగా, వారిలో ఒక్కరిని కూడా సీఐడీ అధికారులు అరెస్టు చేయలేదు. దీంతో ఏడుగురు మదనపల్లెలో కాకుండా బయట ప్రాంతాలకు వెళ్లిపోయారు. నెల రోజులు అజ్ఞాతవాసంలో ఉన్న వీరందరూ ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మదనపల్లె మండలంలోని పలు గ్రామాల్లో పనిచేస్తున్న వీఆర్‌వోలను సీఐడీ అధికారులు విచారించినట్లు తెలిసింది. ఇకపోతే ఇక్కడ పనిచేసిన తహసీల్దార్‌లను, డీటీలను, ఆర్‌ఐలను విచారిస్తారా అనేది తెలియాల్సి ఉంది.