AP: వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదుల కోసం పోలీసుల వేట.. ఇప్పటికే..
ABN , Publish Date - Nov 17 , 2024 | 11:55 AM
వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదుల కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు మరి కొన్ని జిల్లాల్లో కేసు నమోదైన వారికి సెర్చ్ వారెంట్ నోటీసులు జారీ చేశారు.
కడప : వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లపై అధికారులు పూర్తిగా నిఘా పెట్టారు. దీనికోసం జిల్లాకు పది మంది చొప్పున ఓఎస్ ఇంటెలిజెన్స్ టూల్స్ నిపుణులను నియమించిన సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవడం మొదలుకాగానే ‘సైకో బ్యాచ్’ అధికారుల కంట కనబడకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.
సెర్చ్ వారెంట్..
ఈ క్రమంలోనే వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదుల కోసం కడప జిల్లా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 50 మందిని గుర్తించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డితో పాటు మరో 5 మందికి సెర్చ్ వారెంట్ నోటీసులు జారీ చేశారు. కడప జిల్లాతో పాటు అనంతపురం, చిత్తూరు, నెల్లూరు మరి కొన్ని జిల్లాలలో కేసు నమోదైన వారికి సెర్చ్ వారెంట్ నోటీసులు ఇచ్చారు.
అరెస్టుల పర్వం..
జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదులు పలువురు టీడీపీ నేతలను, వారి వారి కుటుంబాలను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయి అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వ్యక్తిగత దూషణకు పాల్పడిన వారిపై నిఘా పెట్టి అరెస్టుల పర్వం కొనసాగిస్తుంది. ఇప్పటికే ముఖ్యమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు.