AP Politics: జనసేనలో చేరడానికి కారణమేంటో చెప్పిన ఎంపీ బాలశౌరి
ABN , Publish Date - Feb 03 , 2024 | 09:19 PM
2004లో వైఎస్ శిష్యుడిగా తాను రాజకీయాల్లోకి వచ్చానని ఎంపీ బాలశౌరి(MP Balashouri) తెలిపారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ నుంచి పోటీ చేసి గెలిచానని తెలిపారు. బందర్ పోర్టు నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు.
గుంటూరు జిల్లా: గత కొంతకాలంగా వైసీపీ(YSRCP)పై అసంతృప్తితో ఉన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి(MP Balashouri) ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం వైఎస్ జగన్(CM YS JAGAN) తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీలో తనకు జరిగిన అన్యాయంపై ఆయన అనుచరుల వద్ద ప్రస్తావించారు. అనుచరులతో చర్చించిన తర్వాతనే వైసీపీకి రాజీనామా చేసి జనసేన(JANASENA)లోకి వెళ్లడానికి ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు.
ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ (PAWAN KALYAN) సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. అయితే ఆయనతో పాటు కొంతమంది కీలక నేతలు కూడా వైసీపీని వీడి జనసేనలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే జనసేనకు బందర్లో కొంతమేర బలం పెరుగుతుందని జనసేన క్యాడర్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి బాలశౌరి శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
పవన్‌పై నమ్మకంతోనే జనసేనలోకి..
2004లో వైఎస్ శిష్యుడిగా తాను రాజకీయాల్లోకి వచ్చానని ఎంపీ వల్లభనేని బాలశౌరి(MP Balashouri) తెలిపారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ నుంచి పోటీ చేసి గెలిచానని తెలిపారు. బందర్ పోర్టు నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. కేంద్ర నిధులు సీఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చినట్లు చెప్పారు. పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదేళ్లలో అనుకున్నంతగా పనులు జరగలేదన్నారు.
పోలవరం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశాలపై పవన్ కల్యాణ్‌తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రేపు(ఆదివారం) పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నానని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ అభివృద్ది చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. చాలామంది తనతో జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా పని చేస్తానని అన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది పవన్ నిర్ణయిస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్‌పై నమ్మకం ఉందని ఎంపీ వల్లభనేని బాలశౌరి చెప్పారు.