Ramakrishna: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు..
ABN , Publish Date - Jan 02 , 2024 | 12:56 PM
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని, ఎన్నికల హామీలను అమలు చేయాలని అంగన్వాడీ, మునిసిపల్ కార్మికులు సమ్మె చేపట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...
విజయవాడ: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని, ఎన్నికల హామీలను అమలు చేయాలని అంగన్వాడీ, మునిసిపల్ కార్మికులు సమ్మె చేపట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి సీపీఐ మద్దతు తెలుపుతుందని చెప్పారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారి సమస్యలు పరిష్కరించనందు వలన వాళ్ళు సమ్మెకు వెళ్లారన్నారు. ఇప్పటి వరకు చేసిన అప్పులతో పోల్చితే కార్మికులకు ఇవ్వాల్సింది చాలా స్వల్పమని అన్నారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని, బైజుస్ కంపెనీ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోందని, అటువంటి కంపెనీతో జగన్ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంటుందని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రభుత్వం లాలూచితోనే బహిరంగంగా దోచుకుంటున్నారని, బైజుస్ సెంటర్ల వద్ద సీపీఐ నిరసన చేపడతాం, బైజుస్ని ప్రభుత్వం కట్టడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రభుత్వ అవినీతిపై లేఖ రాసి మూడు నెలలు అయిందని, ఇంత వరకు స్పందన లేదని.. బీజేపీ, వైసీపీకి లింకు ఉంది కాబట్టే నేటి వరకు ఆ లేఖపై కేంద్రం స్పందించలేదని విమర్శించారు. వైసీపీకు ఉన్నదంతా కాంగ్రెస్ వోట్ బాంక్ అని, నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని రామకృష్ణ పిలుపిచ్చారు.
ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మరణించిన అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పువ్వుల్లో పెట్టి ఇస్తానని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బాధితులకు న్యాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. ఆ హామీ వైసీపీ ప్రభుత్వానికి గుర్తుందా లేదా? అని ప్రశ్నించారు. ఏ వేదిక మీద హామీ ఇచ్చారో ఆ వేదికపై బుధవారం నుంచి 30 గంటలపాటు నిరసన దీక్ష చేపడుతామని అన్నారు. 3,4 తేదీల్లో జరిగే నిరసన దీక్షకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతారని ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు.