Kodali Nani: ఎన్టీఆర్ విగ్రహ ప్రాంగణం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:46 PM
కృష్ణా జిల్లా: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వేల సంఖ్యలో తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు దూసుకెళ్తున్నారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు గుడివాడ పట్టణంలో భారీ వాహన ర్యాలీతో కదం తొక్కారు.
కృష్ణా జిల్లా: గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్దకు తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో దూసుకువెళ్లారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు గుడివాడ పట్టణంలో భారీ వాహన ర్యాలీతో కదం తొక్కారు. దీంతో కొడాలి నాని ఎన్టీఆర్ విగ్రహ ప్రాంగణం నుంచి వేరొక చోటికి వెళ్లిపోయారు. వైసీపీ శ్రేణులు కూడా ఆయన వెంట వెళ్లిపోయారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తమ వాహనాలతో ఢీకొట్టుకుంటూ ఎన్టీఆర్ విగ్రహం వైపుకు దూసుకెళ్లారు.
కాగా గుడివాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బైపాస్ రోడ్డులో టీడీపీ ర్యాలీకు భారీ కేడ్లను పోలీసులు అడ్డంగా పెట్టారు. పార్టీ ఇంచార్జ్ వెనిగళ్ల రామ్మోహన్ నాయకత్వంలో టీడీపీ, జనసేన శ్రేణలు భారీకేడ్లను తోసుకుంటూ ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు - టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది.
‘రా కదలిరా’ పేరుతో గురువారం గుడివాడలో తెలుగుదేశం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేయగా.. దాదాపు లక్ష మంది హాజరవుతారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ రోజు (గురువారం) నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో ఆయన స్వగ్రామం నిమ్మకూరులో చంద్రబాబు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత గుడివాడ సభలో పాల్గొంటారు. అటు ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గుడివాడలో ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు నిర్వహించనున్నారు.
కాగా గుడివాడలో తెలుగుదేశం నిర్వహించనున్న ‘రా కదలి రా’ బహిరంగ సభకు పోలీసులు ఆంక్షలు విధించారు. పట్టణంలోకి తెలుగుదేశం శ్రేణుల ర్యాలీలు రాకుండా పోలీసులు అడ్డగిస్తున్నారు. టీడీపీ శ్రేణుల వాహనాలను బైపాస్ రహదారుల మీదుగా దారి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో గుడివాడ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. నెహ్రూ చౌక్ సెంటర్, ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో తెలుగుదేశం జెండాలు, బ్యానర్లు కట్టనివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. పట్టణం ముఖ్య కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో పోలీసులు తీరును టీడీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.