Share News

MLA Krishna Prasad: వానలు, వరదలు.. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పిలుపు..

ABN , Publish Date - Sep 04 , 2024 | 10:39 AM

ఇవాళ(బుధవారం) తెల్లవారుజూము నుంచి ఎన్టీఆర్, గుంటూరు, తూ.గో. జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మైలవరం నియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాలైన విజయవాడ రూరల్, జక్కంపూడి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.

MLA Krishna Prasad: వానలు, వరదలు.. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పిలుపు..

ఎన్టీఆర్ జిల్లా: భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు వణికిపోతున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, మంచినీరు వంటి నిత్యావసరాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. బుడమేరు ముంచెత్తి విజయవాడ నగరవాసులు నానావస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటించి సహాయక కార్యక్రమాలు చేపట్టారు.


అయితే నిత్యావసరాలు దొరక్క వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటనలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఆహారాన్ని తయారు చేయించి సరఫరా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినప్పటికీ కొందరు అధికారులు మెుద్దు నిద్ర వీడడం లేదు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే, మంత్రులు సహాయక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. మంచినీరు, ఆహారం, పాలు వంటి నిత్యావసరాలు సరఫరా చేయాలని కోరుతున్నారు.


ఇవాళ(బుధవారం) తెల్లవారుజూము నుంచి ఎన్టీఆర్, గుంటూరు, తూ.గో. జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మైలవరం నియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాలైన విజయవాడ రూరల్, జక్కంపూడి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. వరద ప్రభావం లేని ప్రాంతాల ప్రజలు, కూటమి కార్యకర్తలు, నాయకులు బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఈ మేరకు వరద ప్రభావం లేని ప్రాంతాల నుంచి మంచినీటి ట్యాంకర్లు పంపాలని ఎమ్మెల్యే కోరారు. మైలవరం పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వాటర్ ట్యాంకర్లలో మంచినీటిని ఎల్బీఆర్సీ కళాశాలలో నింపుతారని, అనంతరం వాటిని తీసుకెళ్లి బాధితుల దాహం తీర్చాలని ఎమ్మెల్యే ఆదేశించారు.


వరద ప్రభావిత ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నాయకులు ఎవరూ రావద్దని స్థానిక సహాయక కార్యక్రమాల్లోనే వారు పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు. జక్కంపూడి ప్రాంతంలో వరదలు ముంచెత్తి నాలుగు రోజులుగా తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంచినీరు, పాలు వంటి పదార్థాలు బాధితులకు అందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం భోజనం అందిస్తోందని, కూటమి నేతలు ఎవరూ భోజనం సరఫరా చేయెుద్దని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు అందని ప్రాంతాలను గుర్తించి చెప్పాలని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Rain Effect: తూ.గో.జిల్లాకు అలర్ట్.. భారీ వర్షాలకు విద్యాసంస్థలు బంద్..

MP Vijayasai Reddy: విజయసాయి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేత

Updated Date - Sep 04 , 2024 | 10:44 AM