Share News

Satya Kumar: ఆరోగ్యశ్రీపై తప్పుడు ప్రచారం.. వైసీపీపై సత్య కుమార్ ధ్వజం

ABN , Publish Date - Aug 09 , 2024 | 04:20 PM

ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం తీసేస్తుందని కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satya Kumar) ఆరోపించారు. శుక్రవారం నాడు నెల్లూరులో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు.

Satya Kumar: ఆరోగ్యశ్రీపై తప్పుడు ప్రచారం.. వైసీపీపై సత్య కుమార్  ధ్వజం
Minister Satya Kumar

నెల్లూరు: ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం తీసేస్తుందని కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Minister Satya Kumar) ఆరోపించారు. శుక్రవారం నాడు నెల్లూరులో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వంలో ఏపీని పూర్తిగా అవినీతి మయం చేశారని.. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం నుంచి రూ.400 కోట్లను దారి మళ్లించారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు.


ప్రభుత్వ శాఖలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. జగన్ ప్రవేశపెట్టిన జె బ్రాండ్ మద్యం వల్లే రాష్ట్రంలో పలువురు కిడ్నీ, లివర్ వ్యాధుల బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీని తీసేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఆరోగ్యశ్రీ పేరుని మాత్రమే మార్చామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ఏపీలో జగన్‌ను ప్రజలు ఎవరూ నమ్మడం లేదన్నారు. చివరికి ఆయన తల్లి, చెల్లి కూడా నమ్మడం లేదని విమర్శించారు. అందుకే ఢిల్లీ వెళ్లి అబద్ధాల డ్రామా ప్రారంభించారని ఎద్దేవా చేశారు.


రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను ఇస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరింత ప్రగతిని సాధిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసమే చట్టంలో సవరణలు చేస్తోందని.. దీనిని వైసీపీ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. దేశంలో రక్షణ శాఖ, రైల్వేల తర్వాత వక్ఫ్ వద్దే అధికంగా భూములు ఉన్నాయని చెప్పారు. దేశంలో 9 లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయని.. వాటి ఆస్తుల పరిరక్షణ కోసమే కొత్త సవరణలని కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తోందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.

Updated Date - Aug 09 , 2024 | 04:24 PM