MLA Somireddy: ఇరిగేషన్ పనుల్లో రూ.200కోట్ల కుంభకోణం..
ABN , Publish Date - Jul 31 , 2024 | 01:42 PM
గత వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గం(Sarvepalli Constituency)లో ఇరిగేషన్ పనులకు సంబంధించి రూ.200కోట్ల అవినీతి జరిగినట్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్(Kakani Govardhan Reddy) ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లిలో పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు.
నెల్లూరు: గత వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గం(Sarvepalli Constituency)లో ఇరిగేషన్ పనులకు సంబంధించి రూ.200కోట్ల అవినీతి జరిగినట్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్(Kakani Govardhan Reddy) ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లిలో పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు. నీటిపారుదల శాఖ పనులకు సంబంధించి ఒక్క పనీ చేయకుండానే కోట్లలో నిధులు స్వాహా చేశారని సోమిరెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా అక్కంపేట, వీరంపల్లి ప్రాంతాల్లోని పలు ఇరిగేషన్ పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. గత ఐదేళ్ల పాలనలో ఒకే పనికి ఒక్కో ఏడాది వేర్వేరుగా బిల్లులు పెట్టి నిధులు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. ఒక్క పార మట్టి తీయకుండా, ఒక్క చెట్టు కొట్టకుండానే బిల్లులు చేసుకున్నారని మండిపడ్డారు. 5ప్యాకేజీల పేరుతో మాజీ మంత్రి కాకాణి లెఫ్ట్, రైట్ నిధులు దోచుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. పనులు చేయకుండానే బిల్లులు చేయాలని కాకాణి తమ గొంతుపై కత్తిపెట్టి బెదిరిస్తేనే తాము ఆ పని చేసినట్లు అధికారులు చెబుతున్నారని సోమిరెడ్డి చెప్పారు. వైసీపీ హయాంలో తన మాట వినని ఓ అధికారిని ఆయన శ్రీకాకుళం బదిలీ చేశారని, మిగిలిన వారినీ శ్రీకాకుళం వెళ్తారా అంటూ బెదిరించినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. తప్పు ఎవరు చేసినా తప్పే, ఎవ్వరినీ వదిలేది లేదని సోమిరెడ్డి హెచ్చరించారు.
ఏపీలో వైసీపీ పాపాలకి రైతులు మూడు లక్షల ఎకరాల్లో మొదటి పంట పండిచుకోలేకపోయారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ఏపీలో జగన్ ఇసుక, మద్యం, ఖనిజాలు దోచుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా అవినీతికి పాల్పడ్డారని అన్నారు. సర్వేపల్లిలో జరిగిన అక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సర్వేపల్లిలో అవినీతిపై కచ్చితంగా విచారణ చేస్తామని, అక్రమార్కులు ఎంతటి వారైనా వదిలేది లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి హెచ్చరించారు.
ఈ వార్త కూడా చదవండి:
Minister Dola: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యపై విచారణకు మంత్రి ఆదేశం..