Share News

Anil Kumar Yadav: అనిల్ యాదవ్ అడ్రస్ లేడేం..!

ABN , Publish Date - Jun 08 , 2024 | 09:31 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి(NDA Alliance) 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ (YSRCP) ఘోరంగా ఓడిపోవడంతో వైసీపీ కీలక నేతలు అలర్ట్ అవుతున్నారు. ముఖ్య నేతలంతా అండర్ గ్రౌండ్‌కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరు జిల్లాలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ (Anil Kumar) రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

Anil Kumar Yadav: అనిల్ యాదవ్ అడ్రస్ లేడేం..!

నెల్లూరు: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి(NDA Alliance) 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ (YSRCP) ఘోరంగా ఓడిపోవడంతో వైసీపీ కీలక నేతలు అలర్ట్ అవుతున్నారు. ముఖ్య నేతలంతా అండర్ గ్రౌండ్‌కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరు జిల్లాలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ (Anil Kumar) రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నెల్లూరు పెద్దరెడ్లు ఫ్యాన్ పార్టీకి షాక్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో.. చంద్రబాబు సమక్షంలో చేరిన విషయం తెలిసిందే. జగన్ సర్కారు ఏర్పడిన కొద్దీ కాలానికే వైసీపీకి ఫ్యూచర్ లేదని ఈ నేతలు తేల్చేశారు. గతంలో ఫ్యాన్ పార్టీలో ఉన్న నేతలు ఆనం రామానారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వ విధానాలతో విభేదించి టీడీపీలో చేరారు.


ఆ సమయంలో అనిల్ కుమార్ ఆవేశంగా రెచ్చిపోయారు. వైసీపీని వీడిన ఈ ముగ్గురు పార్టీకి ద్రోహం చేశారంటూ ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఈ ముగ్గురు టీడీపీలోకి వెళ్లిన గెలిచేది లేదని మీసం మేలేశారు. వీరిలో ఏ ఒక్కరూ గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. నెల్లూరులో అడుగు కూడా పెట్టనంటూ శపథం చేశారు. అంతటితో సరి పెట్టుకున్నారా అంటే అదీ లేదు. నరసరావుపేట లోక్‌సభ స్థానంలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరోసారి సవాల్ విసిరారు. ఈ సారి ఎన్నికల ఫలితాల్లో అనిల్ ఘోరంగా ఓడిపోయారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో మేకపాటి ఈ దఫా పోటీ చేయలేదు. ఆత్మకూరు నుంచి ఆనం రామానారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు.


ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ 10 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపొందారు. నరసరావుపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన అనిల్ కమార్ ఘోర పరాజయం పాలయ్యారు. అయితే అనిల్ మీసం మేలేసి చేసిన శపథాన్ని నిలబెట్టుకుంటారా రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో విలువైన ఖనిజ సంపద దోపిడీకి గురైంది. క్వార్ట్జ్‌ కొల్లగొట్టి భారీగా సొమ్ముచేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇది అతిపెద్ద కుంభకోణమని టీడీపీ అధికారంలోకి వస్తే జ్యూడీషియల్ విచారణ చేపిస్తామని పలు సందర్భాల్లో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


ఈ కుంభకోణంలో అనిల్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ విషయంపై ఇటీవల మాజీ మంత్రులు కాకణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్ కుమార్ మధ్య గొడవలు జరిగాయని వినిపిస్తోంది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అనిల్ బాగా సొమ్ములను వెనకేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. చైన్నెలో కోట్ల విలువ చేసే ఆస్తులు కొన్నారని విమర్శలు ఉన్నాయి. జగన్ బంధువుతో కలిసి వ్యాపారం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి ఉంటారని అంటున్నారు. మరోవైపు రాజకీయాల్లో ఛాలెంజ్ చేయడం కామన్ అని.. ఇలాంటి వాటిని పాటించాల్సిన అవసరం లేదన్న వాదాన్ని వైసీపీ నేతలు ఎత్తుకున్నారు. మళ్లీ నెల్లూరుకు వస్తారని ఆయన అనుచరులు అంటున్నారు.


అనిల్‌కు చిరకాల రాజకీయ శత్రువు బీసీ నేత శ్రీనివాసులు కూడా గతంలో ఓ శపథం చేసిన విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చేంతా వరకు నల్ల దుస్తులు ధరించడం, బొడి గుండుతో తిరగుతానని శ్రీనివాసులు మూడేళ్ల క్రితం చెప్పిన అంశాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా నడుచుకున్న శ్రీనివాసులు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన రాజకీయ దీక్షను విరమించారు. మరీ అనిల్ కుమార్ సంగతి ఏంటనీ టీడీపీ శ్రేణులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేత తరహాలో అనిల్ కూడా శపథానికి కట్టుబడి ఉండాలని అంటున్నారు.


అలా చేయకపోతే విలువలేని నేతగా అనిల్ కమార్ మిగిలిపోతారని టీడీపీ కేడర్ చెబుతుంది. మాట తప్పాం.. మడమ తిప్పామని అనిల్ కొన్నివేల సార్లు చెప్పారనే విషయాన్ని టీడీపీ నేతలు ఇప్పుడు గుర్తుకు తెస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే విషయంలో అసెంబ్లీ వేదికగా అనిల్ చేసిన ప్రకటనలు ఎంతవరకు కార్యరూపం దాల్చాయని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన మాటకు, చేసిన శపథానికి అనిల్ కుమార్ కట్టుబడి ఉంటారో చూడాలి మరి.

Updated Date - Jun 08 , 2024 | 10:04 PM