Share News

Andhra Pradesh: పెద్దిరెడ్డీ.. దీన్నేమంటారు..?

ABN , Publish Date - Jul 27 , 2024 | 10:19 AM

ప్రాజెక్టు కట్టేందుకు ఎటువంటి అనుమతులూ లేవు.. అయినా అడ్డగోలుగా కట్టేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. పోలీసులతో భయపెట్టి.. మూడు కార్తెలు పండే తల్లిలాంటి భూములు లాక్కున్నారు. పైసా పరిహారం ఇవ్వకుండానే.. దౌర్జన్యంగా పట్టాదార్‌ పాస్‌పుస్తకాలూ తీసేసుకున్నారు.

Andhra Pradesh: పెద్దిరెడ్డీ.. దీన్నేమంటారు..?
Peddireddy Ramachandra Reddy

  • అనుమతుల్లేకుండానే ముదివేడు రిజర్వాయర్‌ నిర్మాణం.

  • నాటి మంత్రి మాటే వేదంగా.. గుడ్డిగా పనులు చేసేసిన అధికారులు.

  • ఎన్‌జీటీ కన్నెర్రతో నిలిచిపోయిన ప్రాజెక్టు.

  • ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి.

  • భూములు కోల్పోయిన రైతులు గగ్గోలు.

  • ప్రాజెక్టు కోసం వారి పొలాల ఆక్రమణ.

  • పైసా పరిహారం ఇవ్వకుండానే.. పాస్‌ పుస్తకాలు లాక్కున్న వైనం.

  • సేద్యానికి భూముల్లేవు.. చేయడానికి పనులూ లేవు.

  • ముదివేడు రిజర్వాయర్‌ బాధితుల ఆవేదన.

ప్రాజెక్టు కట్టేందుకు ఎటువంటి అనుమతులూ లేవు.. అయినా అడ్డగోలుగా కట్టేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. పోలీసులతో భయపెట్టి.. మూడు కార్తెలు పండే తల్లిలాంటి భూములు లాక్కున్నారు. పైసా పరిహారం ఇవ్వకుండానే.. దౌర్జన్యంగా పట్టాదార్‌ పాస్‌పుస్తకాలూ తీసేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధమని ఎన్‌జీటీ అక్షింతలు వేస్తే ఇప్పుడు ప్రాజెక్టునే ఆపేశారు. ఇక అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. సేద్యం చేయడానికి భూముల్లేక.. చేద్దామంటే కూలి పనులూ లేక నిర్వాసిత రైతులు విలవిలలాడుతున్నారు.

రాయచోటి, జులై 27: సాధారణంగా ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలంటే పెద్దతతంగమే ఉంటుంది. పర్యావరణ అనుమతులు తప్పనిసరి. అయితే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుం బం చేపట్టిన ముదివేడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు ఎటువంటి అనుమతులూ లేవు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే.. తమ సామ్రాజ్యంగా భావించే పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఈ కుటుంబం మూడు ప్రాజెక్టులు నిర్మించాలని భావించింది. ఈ ప్రాజెక్టుల వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందో ఉండదో అని కాకుండా.. తామెంత వెనుకేసుకోవచ్చనే ఆలోచనతోనే వీటిని తలపెట్టారని జనం ఆరోపిస్తున్నారు.


అనుకున్నదే తడవుగా చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుట్టపల్లె వద్ద నిర్మిస్తున్న ఒక రిజర్వాయర్‌, సోమల మండ లం ఆవులపల్లె వద్ద మరో రిజర్వాయర్‌, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట ముదివేడు వద్ద ఇంకో రిజర్వాయర్‌ నిర్మాణానికి నిర్ణయించుకున్నారు. పర్యావరణ అనుమతుల కోసం నేతిగుట్టపల్లె రిజర్వాయర్‌కు మాత్రమే జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ)కి జగన్‌ ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఆ అనుమతులు రాకముందే ఈ రిజర్వా యర్‌ పనులు సుమారు 90 శాతం పూర్తయ్యాయి. ఒక టికెట్‌కు మూడు సినిమాలు అన్నట్లు.. ఈ దరఖాస్తుతోనే.. మిగిలిన రెండు రిజర్వాయర్ల పనులూ మొదలు పెట్టారు. రాష్ట్ర మంత్రిగా పెద్దిరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి, రాజంపేట ఎంపీగా ఆయన తనయుడు మిథున్‌రెడ్డి బాధ్యతాయుతమైన పదువుల్లో ఉండీ.. నిబంధనలు తుంగలో తొక్కి.. అనుమతుల ఊసు లేకుండానే పనులు చేపట్టాలని ఆదేశించడంతో.. అధికారులు అదేమిటని అడగకుండా.. పెద్దిరెడ్డి మాటలే వేదవాక్కుగా భావించి.. గుడ్డిగా పనులు మొదలు పెట్టి... శరవేగంగా పూర్తి చేశారు.


ఆవులపల్లె కేవలం జంగిల్‌ క్లియరెన్స్‌ పనుల వద్ద ఉండగా.. ముదివేడు రిజర్వాయర్‌ పనులు సుమారు 70 శాతం పూర్తయ్యాయి. అయితే అనుమతులు లేకుండా పనులు చేపట్టినందుకు.. అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు.. ఈ పనులను నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌జీటీ రూ.100 కోట్ల భారీ జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిని సుప్రీంకోర్టు సైతం సమర్థించింది.


పరిహారం ఇవ్వకుండానే 1,075 ఎకరాలు..

ముదివేడు రిజర్వాయర్‌ కోసం కురబలకోట మండలం ముదివేడు, పిచ్చలవాండ్లపల్లె, బి.కొత్తకోట మండలం కొత్తఊరు గ్రామాల్లో భూములను ప్రభుత్వం సేకరించింది. పట్టా, ప్రభుత్వ, డీకేటీ భూములతో కలిపి మొత్తం 1075.81 ఎకరాలు ఇందులో ఉన్నాయి. ముదివేడు గ్రామం చౌటగుంటపల్లె, కొత్తపల్లె, శీతోళ్లపల్లె (శీతువారిపల్లె), నడింగడ్డలు పూర్తిగా రిజర్వాయర్‌ కింద మునిగిపోతాయి. సీతువారిపల్లెలో 45 ఇళ్లు, కొత్తపల్లెలో 35, చౌటగుంటలో 100 ఇళ్లలో 50, నేతాజినగర్‌లో 10 ఇళ్లు మునకలో పోతాయి. రిజర్వాయర్‌ మునకలో అప్పలమ్మచెరువు, శీతోళ్లపల్లె చెరువు, జమ్ముకుంట పోతాయి. ఈ చెరువుల కింద.. ఎటువంటి చీకూచింతా లేకుండా ఏటా మూడు పంటలు పండించుకునే వాళ్లమని రైతులు ఆవేదన చెందుతున్నారు.


పైసా నష్టపరిహారం ఇవ్వకుండానే తమకు కావలసిన భూములను కాంట్రాక్టర్లు రైతుల నుంచి లాగేసుకున్నారు. పనులు మొదలు పెట్టి.. భూముల్లో పెద్ద పెద్ద గుంతలు తవ్వి.. మట్టి తరలించారు. తమకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు పనులు చేయవద్దని రైతులు అడిగితే పోలీసులతో బెదిరించారు. పనులు మొదలైన సుమారు రెండేళ్ల తర్వాత ఎకరాకు రూ.12.5 లక్షలు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఒక్క రైతుకు కూడా పైసా నష్టపరిహారం ఇవ్వలేదు. పైగా వారి నుంచి బలవంతంగా పట్టాదార్‌ పాసుపుస్తకాలు లాక్కున్నారు. ఆ భూములూ తీసేసుకున్నారు.. ఇప్పుడు ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. భూములు సేద్యానికి పనికిరాకుండా పోయాయి.. బయట పనులకు వెళ్లాలన్నా.. కూలి పనులు లేవు.. ఎలా బతకాలని రైతులు వాపోతున్నారు. ముంపునకు గురయ్యే సీతువారిపల్లెలో సుమారు 70 కుటుంబాలు ఉంటాయి.


ఈ పల్లెలో దాదాపూ ప్రతి రైతూ ఏదో ఒక విధంగా నష్టపోయేవారే ఉండడం గమనార్హం. అనుమతుల్లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టు సంస్థ, పనులు చేయించిన పెద్దిరెడ్డి కుటుంబం, అధికారులపైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే అనుమతుల్లేకుండా పనులు చేయడం నేరమని తెలిసినా.. వాటిని పర్యవేక్షించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ‘పచ్చగా బతుకుతున్న మా బతుకుల్లో.. నిప్పులు పోశారు.. మా రోదనలు.. వేదనల మీద డబ్బు మేడలు కట్టుకున్నారు. పెద్దిరెడ్డీ.. దీన్నేమంటారు’ అని వారు నిలదీస్తున్నారు.


ఇప్పటికీ పరిహారం లేదు..

ఎకరాకు రూ.12.5 లక్షలు ఇస్తామని కలెక్టర్‌, ఆర్డీవో, ఇతర అధికారులు వచ్చి చెప్పారు. పదెకరాలు తీసుకున్నారు. అదనంగా ఇంకో ఎకరాలో డబ్బు ఇస్తామని చెప్పి మట్టి తోడేశారు. చెప్పిన నష్టపరిహారం ఇప్పటికీ ఇవ్వలేదు. డబ్బులిస్తామని మా దగ్గర పట్టాదారు పాసుపుస్తకం తీసేసుకున్నారు. పొలాల్లో మట్టి తోడేయడంతో ఇప్పుడవి సేద్యానికి పనికిరావు. మా ఊరు మునకలో పోతోంది. ఇల్లు కట్టిస్తామని చెప్పారు. కట్టించలేదు. కనీసం జాగా అయినా చూపించాలని అడిగితే.. అదిగో.. ఇదిగో అంటూ గడిపేశారు.

- మధుసూదన్‌రెడ్డి, శీతువారిపల్లె


చట్టవిరుద్ధంగా తీసుకున్నారు..

ముదివేడు రిజర్వాయర్‌ నిర్మాణానికి అనుమతి లేదని తెలిసీ చట్టవిరుద్ధంగా మా భూములు తీసేసుకున్నారు. పల్లెకు దారి లేకుండా చేశారు. పొలాల్లో మట్టి ఎత్తి పెద్ద పెద్ద గుంతలు చేశారు. మావి పది ఎకరాలు ప్రాజెక్టు కింద పోయాయి. నష్టపరిహారం కూడా ఇవ్వకుండా రైతుల నోళ్లు కొట్టడం అన్యాయం. పాలు అమ్ముకోవాలన్నా.. కష్టంగా ఉంది. వ్యాన్‌లు మా ఊరికి రావడం లేదు. మేమే రెండు కిలోమీటర్లు వెళ్లి పాలు పోసి వస్తున్నాం. ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని ఆదుకోవాలి.

- శివశంకర్‌రెడ్డి, శీతువారిపల్లె


అధికారులు సంతకాలు తీసుకున్నారు..

అధికారులు మమ్మల్ని మండల ఆఫీసు దగ్గరకు పిలిపించి.. మా దగ్గర ఆరేడు పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు. నష్టపరిహారం ఇస్తారనుకున్నాం.. ఇవ్వలేదు. మా దగ్గర ఉండే పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.. మా పాస్‌పుస్తకాలు మాకు ఇచ్చేయాలి. పొలాల్లో గుంతలు తవ్వడంతో.. పంటల సాగు అటుంచి.. కనీసం పశువుల మేతకు కూడా ఇబ్బందులు పడుతున్నాం.

- ద్వారకానాథరెడ్డి, శీతువారిపల్లె


Also Read:

ధోనీ, రోహిత్, కోహ్లీ కాదు.. టీమిండియా బెస్ట్ కెప్టెన్ అతడేనట!

కొత్త కోచ్.. కొత్త కెప్టెన్..

రూ.2.20 కోట్లతో పరార్.. పట్టిస్తే బంపరాఫర్..!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jul 27 , 2024 | 10:19 AM