Share News

Retired IPS officer AB Venkateswara Rao : ఆ ఫిరాయింపులకు నేను కారణం కాదు

ABN , Publish Date - Jun 02 , 2024 | 04:22 AM

వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి తాను కారణం కాదని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. వారిలో 22మంది ఇప్పటికీ ఉన్నారని... తనవల్లే పార్టీ మారినట్లు వారితో చెప్పించాలని ఆయన సవాల్‌ విసిరారు.

Retired IPS officer AB Venkateswara Rao : ఆ ఫిరాయింపులకు  నేను కారణం కాదు

చెప్పుడు మాటలు విని నన్ను బకరాను చేశారు

చేయని తప్పునకు పోరాటం చేయాల్సి వచ్చింది

వివేకా హత్య కేసులో ప్రాథమిక సాక్ష్యాలే కీలకం

అప్పట్లో పూర్తి ఆధారాలు సేకరించలేదు

ప్రజలు, సమాజం కోసం స్పందిస్తూనే ఉంటా

‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’తో ఏబీ వెంకటేశ్వరరావు

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి తాను కారణం కాదని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. వారిలో 22మంది ఇప్పటికీ ఉన్నారని... తనవల్లే పార్టీ మారినట్లు వారితో చెప్పించాలని ఆయన సవాల్‌ విసిరారు. రాజకీయ కోణంలో జరిగిన ప్రక్రియతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

శనివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’తో మాట్లాడారు. పార్టీ మార్పుపై ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో విధంగా స్పందించారని, వివిధ కారణాలతో వచ్చిన వారిని తాను తీసుకొచ్చినట్లు నింద వేసి బకరాను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ శాఖలో కొంతమంది అబద్ధాలు చెప్పి ఉండొచ్చని, అదే వాస్తవం అనుకుని తనను టార్గెట్‌ చేసి కేసులు పెట్టారని వాపోయారు. వివేకా హత్య కేసులో ప్రాథమిక సాక్ష్యాలు చాలా కీలకమని అన్నారు. అక్కడ అన్నీ భూతద్దంలో వెతకాలని, అన్ని రకాల సాక్ష్యాలు సేకరించాలని ఘటన జరిగిన రోజు సూచించానని తెలిపారు. వివేకా కేసులో ఆనాడు పూర్తిగా ఆధారాలు సేకరించలేదని చెప్పారు.

విచారణలో భాగంగా కింది సిబ్బందికి సూచనలు చేయడం సహజ ప్రక్రియ అని, ఇప్పటికీ ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై మాట్లాడకూడదని పేర్కొన్నారు. 2019 తర్వాత పరిపాలన విధానంలో స్పష్టమైన మార్పు కనిపించిందని, తన విషయంలో ఊహించని పరిణామాలు నెలకొన్నాయని చెప్పారు. తన తప్పు ఉంటే క్షమాపణ చెప్పి శిక్షకు సిద్ధమయ్యే వాడినని, తాను తప్పు చేయనందుకే పోరాటం చేయాలని భావించానని ఆయన వివరించారు.


ఇప్పటికీ న్యాయస్థానంలో పోరాటం కొనసాగుతోందని తెలిపారు. తన పోరాటంలో లక్షల మంది మానసికంగా అండగా నిలిచారని, వారిచ్చిన ధైర్యం తనలో మనోస్థైర్యాన్ని నింపిందని అన్నారు. పోరాడే కొద్దీ ఇంకా కొత్త కేసులు పెట్టారని, దాంతో తనలో పోరాట పటిమ మరింత పెరిగిందని చెప్పారు.

తనలాంటి వాళ్లు కూడా జరిగిన తప్పులపై పోరాటం చేయకపోతే ఇక ఎవరు ముందుకొస్తారని ప్రశ్నించారు. ఇంతకాలం తనకు జరిగిన అన్యాయంపై న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని తెలిపారు. పరిపాలన వ్యవస్థలో అనేక రూల్స్‌ ఉంటాయని, వాటిని పట్టించుకోకుండా ఆరోపణలు చేసి విచారణ పేరుతో కాలయాపన చేశారని ఆరోపించారు.

ఆ సమయంలో తాను సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉండేదని, ఒక కేసు తేలిన వెంటనే ఇంకోటి పెట్టి విచారణ అనేవారని, ఊరూ పేరు లేనివాడు రెండో శనివారం తనపై ఆరోపణలు చేసి, దాన్ని పేపర్‌లో పబ్లిష్‌ చేసేవారని చెప్పారు. ఎలాంటి ఆధారం లేనివాటికి తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు.

నాయకుడికి నిజానిజాలు విశ్లేషించుకునే గుణం ఉండాలని చెప్పారు. అందరి జీవితాలు ఒకేలా సాగవని, అనుకోని సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. అనూహ్యంగా మలుపులు తిరిగినా ఎదుర్కొన్నానని, ఈ ఐదేళ్లు తనకు జరిగిన అన్యాయంపై ఉద్యమం చేశానని పేర్కొన్నారు. సమాజ హితం కోసం తన పని తాను చేస్తానని, శేషజీవితం ప్రశాంతంగా కొనసాగిస్తూ, ప్రజలు, సమాజం కోసం స్పందిస్తూనే ఉంటానని ఏబీవీ తెలిపారు.

Updated Date - Jun 02 , 2024 | 04:24 AM