Share News

Cyclone Dana: దానా తుపానుపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన

ABN , Publish Date - Oct 23 , 2024 | 02:49 PM

తూర్పుమధ్య బంగాళాఖాతంలో దానా తుపాను మరింత తీవ్ర రూపం దాల్చింది. గురువారం అర్ధరాత్రి నుంచి తీరం దాటనున్న ఈ తుపాను ప్రభావం ఏపీపై తక్కువే అయినప్పటికీ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభావం కానున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.

Cyclone Dana: దానా తుపానుపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన
Cyclone Dana

అమరావతి: తూర్పుమధ్య బంగాళాఖాతంలో బలమైన తుపానుగా మారిన ‘దానా’ ముంచుకొస్తోంది. తీరం దాటనున్న నేపథ్యంలో ఆందోళన కలిగిస్తోంది. ప్రభావితం కానున్న రాష్ట్రాలు ముమ్మర ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పై పాక్షిక ప్రభావం ఉండనుండడంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ఇవాళ (బుధవారం) ప్రకటన విడుదల చేసింది. దానా తుపాను రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని, గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా కదిలిందని వెల్లడించింది.


ఈ తుపాను గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటనుందని పేర్కొంది. ఈ తుపాను ప్రస్తుతానికి పారాదీప్‌కు (ఒడిశా) 520 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 600 కిలోమీటర్లు, ఖేపుపరాకు (బంగ్లాదేశ్) 610 కిలోమీటర్ల దూరంలో కదులుతోందని వివరించింది. కాగా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం నుంచి గంటకు 80-100 కి.మీ. వేగంతో వీస్తాయని తెలిపింది. ఇక రేపు (గురువారం) రాత్రి నుంచి 100-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Dana.jpg


ఈ జాగ్రత్తలు పాటించండి..

దానా తుపాను ప్రభావం నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రజలు కింద సూచించిన జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.


సూచనలు ఇవే

1. భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు.

2. ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి. అలాంటి చెట్ల కింద ఉండవద్దు.

3. వేలాడుతూ, ఊగుతూ ఉండే రేకులు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి.

4. పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి.

5. కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు, హోర్డింగ్స్‌కు దూరంగా ఉండండి.

6. ప్రయాణంలో ఉన్నట్టయితే వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోండి.


ఇవి కూడా చదవండి

ఏపీలో లా అండ్ అర్డర్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

తుపాను ఎఫెక్ట్.. రెండు రైళ్లు రద్దు

For more AP News and Telugu News

Updated Date - Oct 23 , 2024 | 02:57 PM