వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించం
ABN , Publish Date - Nov 19 , 2024 | 04:51 AM
వైసీపీ ప్రభుత్వం ఇంధన రంగంలో రూ.1.29 లక్షల కోట్ల మేరకు అప్పులు చేసిందని రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
మంత్రి గొట్టిపాటి రవి స్పష్టీకరణ
అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం ఇంధన రంగంలో రూ.1.29 లక్షల కోట్ల మేరకు అప్పులు చేసిందని రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించబోమని తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పీపీఏలు రద్దు చేయవద్దని కేంద్రం చెప్పినా జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్తాయని కేంద్రం చెప్పినా వినలేదన్నారు. వైసీపీ హయాంలో ఒక్క మోగావాట్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేదని చెప్పారు. ఇంధన రంగాన్ని గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. హరిత, పునరుత్పాదక విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తునట్లు తెలిపారు.
గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఏపీ విద్యుత్ సుంకం(రెండో సవరణ)-2024 బిల్లు తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ సవరణ వల్ల కొత్తగా వినియోగదారులపై అదనపు భారం గానీ, విద్యుత్ సుంకం గానీ విధించడంలేదని స్పష్టం చేశారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, ఇప్పుడు ట్రూప్ చార్జీలు పెంచుతూ బిల్లు తేవడం సమంజం కాదని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం బిల్లు సభ ఆమోదం పొందింది.