Cyber Fraud ఈ-నేరగాళ్లకు ఝలక్ ఇచ్చిన ఉద్యోగి
ABN , Publish Date - Nov 21 , 2024 | 10:08 AM
సైబర్ నేరగాళ్లను బురిడీ కొట్టించాడో ఉద్యోగి. కొరియర్ ట్రాకింగ్ కోసం కాల్ చేయడంతో.. సైబర్ నేరగాళ్లు లైన్‌లోకి వచ్చారు. ఓటీపీ చెప్పాలని కోరారు. అనుమానం వచ్చి బ్యాంక్‌కు వెళ్లి క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయాలని కోరారు.
కొరియర్ ట్రాకింగ్ కోసం కాల్‌చేసి ఇరుక్కున్న ఉద్యోగి
లింక్ పంపి ఫోన్‌ను హ్యాక్ చేసిన సైబర్ సైకోలు
ఆన్‌లైన్‌లో రూ.5 లక్షల ఇన్‌స్టా లోన్ పెట్టిన నేరగాళ్లు
వరుస ఓటీపీలు రావడంతో అప్రమత్తమైన ఉద్యోగి
చాకచక్యంగా కార్డు, అకౌంట్ల బ్లాక్
నేరగాళ్లు పెట్టిన రుణం తన సేవింగ్ ఖాతాకే మళ్లింపు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు ఇరుక్కుని లక్షలాది రూపాయలను కోల్పోతున్నారు. ఇలా కొరియర్ ట్రాకింగ్ కోసం ఫోన్‌చేసి సైబర్ నేరగాళ్లకు చిక్కిన ఓ వ్యక్తి వెంటనే అప్రమత్తమై వారికే ఝలక్ ఇచ్చాడు. ఆయన క్రెడిట్‌కార్డు నుంచి డబ్బు లాగేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా అన్ని మార్గాలను బ్లాక్ చేసి కంగు తినిపించాడు. వివరాల్లోకి వెళితే..
కొరియర్ కోసం కాల్ చేస్తే..
పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన నాగేశ్వరరావు బందరు రోడ్డులో ఉన్న స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో ఉద్యోగి. ఆయనకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి పార్శిల్ రావాల్సి ఉంది. ఈ నెల 14న రాజమండ్రిలో పార్శిల్‌ను డీటీడీసీ కొరియర్ చేశారు. 15వ తేదీన ఆఫీసుకు సెలవు. 16న చేరాల్సిన పార్శిల్ రాకపోవడంతో డీటీడీసీ వెబ్‌సైట్‌లో ఆర్డర్ నెంబర్ ద్వారా నాగేశ్వరరావు ట్రాక్ చేశారు. పార్శిల్ విజయవాడలో డెలివరీకి వచ్చినట్టు చూపించింది. ఎంతసేపటికి పార్శిల్ రాకపోవడంతో వెబ్‌సైట్‌లో దిగువన కాంటాక్ట్ అజ్.. అని పేర్కొంటూ ఫోన్ నెంబర్ ఇచ్చారు. దీంతో నాగేశ్వరరావు ఆ నెంబరుకు కాల్ చేశారు. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడుతూ మరో కాల్ వస్తుంది, దాంతో మాట్లాడమని చెప్పాడు. ఇలా ఫోన్ కట్ అవ్వగానే మరో నెంబర్ నుంచి నాగేశ్వరరావుకు ఫోన్ వచ్చింది. అతడు హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడి వేరే ఫోన్ నెంబర్ నుంచి వాట్సాప్ ద్వారా లింక్ పంపి, దాన్ని క్లిక్ చేయమన్నాడు. అనుమానం వచ్చిన ఆయన ఇది డీటీడీసీ కొరియరేనా.. అని ప్రశ్నించాడు. అవతలి వ్యక్తి అవునని సమాధానమిచ్చాడు. క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుందని, వెంటనే చెప్పాలని అవతలి వ్యక్తి అడగ్గానే నాగేశ్వరరావు చెప్పేశారు. తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే ఆప్షన్లలో రూ.5 పంపితే, తిరిగి జమ అవుతాయని అవతలి వ్యక్తి వివరించాడు. ఇదంతా కన్ఫర్మేషన్ కోసమేనని నమ్మించాడు.
ఫోన్ హ్యాక్ చేసి ఇన్‌స్టా లోన్
నాగేశ్వరరావుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది. దీని పరిమితి రూ.7 లక్షలు. ఆయనకు ఇదే బ్యాంక్‌లో సేవింగ్ ఖాతా కూడా ఉంది. క్రెడిట్ కార్డును ఆయన గూగుల్ పేకు అనుసంధానం చేసుకున్నారు. షాపింగ్‌కు వెళ్లినప్పుడు గూగుల్ పే ద్వారా ఆ కార్డు నుంచి చెల్లింపులు చేస్తుండేవారు. కొరియర్ కోసం ఫోన్ చేసినప్పుడు అవతలి వ్యక్తి డబ్బులు పే చేయమనగానే, ఈ కార్డు ద్వారా రూ.5 పంపారు. కాసేపట్లో కొరియర్ చేతికి అందుతుందని చెప్పి అవతలి వ్యక్తి ఫోన్‌ను పెట్టేశాడు. కొద్దిసేపటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి ఓటీపీలు, సందేశాలు వరుసగా వచ్చాయి. అందులో రూ.5 లక్షలను ఉపయోగించినట్టు ఒక సందేశం ఉంది. అనుమానం వచ్చిన నాగేశ్వరరావు కార్డుపరిమితిని పరిశీలించుకోగా, అందులో రూ.లక్ష మాత్రమే చూపిస్తోంది. రూ.6 లక్షలకు గాను రూ.5 లక్షలు ఉపయోగించినట్టు చూపించింది. తాను సైబర్ నేరగాళ్ల ట్రాప్‌లో ఇరుక్కున్నానని తెలుసుకున్న నాగేశ్వరరావు బ్యాంక్‌కు వెళ్లి విషయం చెప్పారు. కార్డును బ్లాక్ చేయమన్నారు. అయితే, అక్కడి సిబ్బంది ఆన్‌లైన్‌లో పరిశీలించి అటువంటిదేమీ లేదని చెప్పారు. తర్వాత క్రెడిట్‌కార్డు కాల్ సెంటర్‌కు ఫోన్ చేసినా ఇదే సమాధానం వచ్చింది. లింక్ ద్వారా నాగేశ్వరరావు ఫోన్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డుపై ఇన్‌స్టా లోన్‌కు దరఖాస్తు చేశారు. ఇది మూడు దశల్లో ఉంటుంది. ప్రతి దశలోనూ ఓటీపీ ఎంటర్ చేయాలి. నాగేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడుతుండగానే సైబర్ నేరగాళ్లు ఈ ప్రక్రియ పూర్తిచేశారు. ఇన్‌స్టా రుణానికి సంబంధించిన డబ్బు ఆ బ్యాంక్‌లో ఉన్న అకౌంట్‌లో జమ అవుతాయి. ఆవిధంగానే రూ.5 లక్షలు నాగేశ్వరరావు అకౌంట్‌లో జమ అయ్యాయి. ఇది వెంటనే అప్‌డేట్ కాకపోవడంతో బ్యాంక్, కాల్ సెంటర్ సిబ్బందికి వెంటనే చూపించలేదు. అప్పటికే ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డును బ్లాక్ చేయాలని ఆయన దరఖాస్తులు బ్యాంక్ సిబ్బందికి ఇచ్చారు. వెంటనే స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న సిమ్‌ను తీసేసి కీప్యాడ్ ఫోన్‌లో వేశారు. దీంతో సైబర్ నేరగాళ్లు ఫోన్‌ను హ్యాక్ చేయలేకపోయారు. 18వ తేదీన బ్యాంక్ సిబ్బంది, కాల్ సెంటర్ సిబ్బంది ఫోన్‌చేసి క్రెడిట్ కార్డుపై ఇన్‌స్టా లోన్ రూ.5 లక్షలు తీసుకున్నారని చెప్పారు. ఇది తన ప్రమేయం లేకుండా జరిగిందని, తన అకౌంట్‌లో జమ అయిన రూ.5 లక్షలను మినహాయించుకుని క్రెడిట్ కార్డుకు జమ చేసుకోవాలని నాగేశ్వరరావు చెప్పారు. ఆయన ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డును వెంటనే బ్లాక్ చేయడంతో సైబర్ నేరగాళ్లు డబ్బు లాగడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు.
Also Read:
రోడ్డు పక్కన కనిపించే వీటిని తింటున్నారా..
గ్యాంగ్‌స్టర్ల రాజధాని.. సీఎం సంచలన వ్యాఖ్యలు
For More Andhra Pradesh News and Telugu News..