Share News

AP New Cabinet: 24 మందితో కేబినెట్‌ బీసీ నేతలకే పెద్దపీట

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:24 AM

తన మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు టీడీపీ కూటమి సారథి చంద్రబాబు అధిక ప్రాధాన్యమిచ్చారు.

AP New Cabinet: 24 మందితో కేబినెట్‌ బీసీ నేతలకే పెద్దపీట
Chandrababu

  • అచ్చెన్న, కొల్లు సహా 8 మందికి మంత్రి పదవులు

  • అనిత, సవిత సహా ముగ్గురు మహిళలకు చోటు

  • పవన్‌, దుర్గేశ్‌, కొండపల్లి సహా 8 మంది కొత్త ఎమ్మెల్యేలకు చోటు

  • పాత తరం ఆనం, కొలుసుకూ చోటు

  • నారాయణ, లోకేశ్‌, కేశవ్‌, ఫరూక్‌ కూడా

  • ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఓ మంత్రి పదవి

  • ఆ లెక్కన జనసేనకు మూడు, బీజేపీకి ఒకటి

(అమరావతి-ఆంధ్రజ్యోతి): తన మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు టీడీపీ కూటమి సారథి చంద్రబాబు అధిక ప్రాధాన్యమిచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి సహా 8 మంది బీసీ నేతలకు అవకాశమిచ్చారు. అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, సీనియర్‌ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి, కొత్తగా ఎన్నికైన సవితకు కూడా మంత్రి పదవులు లభించాయి. జనసేనాని పవన్‌ కల్యాణ్‌, కందుల దుర్గేశ్‌, సవిత సహా కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు కల్పించారు. ఆయనతో పాటు పదవీప్రమాణం చేసే మొత్తం 25 మంది మంత్రుల పేర్లను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెరి నాలుగు పదవులు దక్కాయి. కాపుల్లో పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్‌, దుర్గేశ్‌.. కమ్మ వర్గానికి చెందిన లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌, పయ్యావుల కేశవ్‌, గొట్టిపాటి రవికుమార్‌కు.. రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్‌ నేత ఆనం రామనారాయణరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎం.రాంప్రసాద్‌రెడ్డికి అవకాశం లభించింది.


ఎస్సీ కోటాలో అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, ఆర్య వైశ్య వర్గం తరఫున టీజీ భరత్‌ చోటు సంపాదించారు. అసెంబ్లీలో 175 సీట్లు ఉండగా మంత్రివర్గంలో 25 మంది మంత్రులను తీసుకోవడానికి అవకాశం ఉంది. కేబినెట్‌ కూర్పునకు చంద్రబాబు ఓ ఫార్ములా రూపొందించారు. ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించారు. ఆ లెక్కన 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు మూడు, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒకటి (సత్యకుమార్‌).. 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంత్రి పదవులు లభించాయి. పదవులు పొందిన బీసీ నేతల్లో ఇంకా కొండపల్లి శ్రీనివాస్‌, వాసంశెట్టి సుభాష్‌, సత్యకుమార్‌, సవిత ఉన్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు అత్యఽధికంగా మూడేసి మంత్రిపదవులు దక్కాయి. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, విజయనగరం, ప్రకాశం జిల్లాలకు రెండేసి లభించాయి. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరెవరికీ అవకాశం లభించలేదు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలనుంచి కూడా ఒక్కొక్కరికే చాన్సు దక్కింది. అలాగే శాసనమండలి నుంచి ఎవరికీ దక్కలేదు.


ఉమ్మడి జిల్లాల వారీగా కేబినెట్‌లో ప్రాతినిధ్యం

చిత్తూరు - 1 (ముఖ్యమంత్రి)

కడప - 1

విశాఖపట్నం - 1

శ్రీకాకుళం - 1

తూర్పు గోదావరి - 2

ప్రకాశం - 2

విజయనగరం - 2

కృష్ణా - 2

నెల్లూరు - 2

పశ్చిమ గోదావరి - 2

గుంటూరు - 3

అనంతపురం - 3

కర్నూలు - 3

తెలుగుదేశం

1. నారా లోకేశ్‌, మంగళగిరి

2. కింజారపు అచ్చెన్నాయుడు, టెక్కలి

3. కొల్లు రవీంద్ర, బందరు

4. పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ

5. వంగలపూడి అనిత, పాయకరావుపేట

6. నిమ్మల రామానాయుడు, పాలకొల్లు

7. ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల

8. ఆనం రామనారాయణ రెడ్డి, ఆత్మకూరు

9. పయ్యావుల కేశవ్‌, ఉరవకొండ

10. అనగాని సత్యప్రసాద్‌, రేపల్లె

11. కొలుసు పార్థసారథి, నూజివీడు

12. డోలా బాల వీరాంజనేయ స్వామి, కొండపి

13. గొట్టిపాటి రవికుమార్‌, అద్దంకి

14. గుమ్మడి సంధ్యారాణి, సాలూరు

15. బీసీ జనార్దన రెడ్డి, బనగానపల్లి

16. టీజీ భరత్‌, కర్నూలు

17. ఎస్‌.సవిత, పెనుకొండ

18. కొండపల్లి శ్రీనివాస్‌,గజపతినగరం

19. ఎం.రాంప్రసాద్‌ రెడ్డి, రాయచోటి

20. వాసంశెట్టి సుభాష్‌, రామచంద్రాపురం

జనసేన

1. పవన్‌ కల్యాణ్‌, పిఠాపురం

2. నాదెండ్ల మనోహర్‌, తెనాలి

3. కందుల దుర్గేశ్‌, నిడదవోలు

బీజేపీ

1. సత్యకుమార్‌ యాదవ్‌, ధర్మవరం

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 12 , 2024 | 08:02 AM