Share News

Telugu States: ముందంజలో తెలంగాణ, వెనకబడిన ఏపీ

ABN , Publish Date - Sep 02 , 2024 | 08:10 AM

కేంద్ర ఆర్థిక శాఖ ఆగస్టు నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్ల(GST Collections) గణాంకాలను ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాల వారీగా ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.

Telugu States: ముందంజలో తెలంగాణ, వెనకబడిన ఏపీ

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ ఆగస్టు నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్ల(GST Collections) గణాంకాలను ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాల వారీగా ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. అయితే జీఎస్టీ వసూళ్లలో గతంతో పోలిస్తే తెలంగాణ కాస్త ముందంజలో ఉండగా.. ఏపీ వెనకబడింది.

ఆగస్టులో ఏపీ జీఎస్టీ వసూళ్లు 5 శాతం తగ్గినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో రూ.3,479 కోట్లు వసూలయ్యాయి. అయితే ఈ ఏడాది రూ.3,298 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. మరోవైపు తెలంగాణలో 4 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. గత ఏడాది ఆగస్టులో రూ.4,393 కోట్లు వసూలుకాగా, ఈసారి ఆ మొత్తం రూ.4,569 కోట్లకు పెరిగినట్లు ప్రకటించింది.


అత్యధికం మహారాష్ట్రే..

గుజరాత్ 6 శాతం వార్షిక వృద్ధితో10,344 కోట్లు, తమిళనాడు 7 శాతం వృద్ధితో రూ.10,181 కోట్లు, తెలంగాణ 4 శాతం వృద్ధితో రూ.4,569, ఏపీ 5 శాతం క్షీణించి రూ.3,298 కోట్లు కలెక్ట్ చేశాయి. హర్యానా12 శాతం వృద్ధితో రూ.8,623 కోట్లు, ఉత్తరప్రదేశ్ 11 శాతం వృద్ధితో రూ.8,269 కోట్లు, మధ్యప్రదేశ్12 శాతం వృద్ధితో రూ.3,438 కోట్లు, కర్ణాటకలో 11 వృద్ధితో రూ.12,344 కోట్లు, మహారాష్ట్ర 13 శాతం వృద్ధితో రూ.26,367 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.

10 శాతం అధిక వసూళ్లు..

కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్లు రూ.1,74,962 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో వసూలైన రూ.1,59,069 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. అయితే ఈ ఏడాది జూలైతో పోలిస్తే మాత్రం ఇది తక్కువే. ఈ ఏడాది జూలైలో జీఎస్టీ వసూళ్లు రూ.1,82,075 కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు జీఎస్టీ ద్వారా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు రూ.9.13 లక్షల కోట్లు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూలైన రూ.8.29 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 10.1 శాతం ఎక్కువ.


9న జీఎస్టీ మండలి భేటీ..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ మండలి ఈ నెల 9న భేటీ కానుంది. కొన్ని వస్తువులపై జీఎస్టీ హేతుబద్ధీకరణ, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు.

ఆగస్టులో సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీతో పాటు సెస్సుల వసూళ్లలోనూ పెరుగుదల కనిపించింది. సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీల వసూళ్లు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 9.2 శాతం పెరిగి రూ.1.25 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతి వస్తువులపై విధించే జీఎస్టీ, వసూళ్లు 12.1 శాతం పెరిగి రూ.49,976 కోట్లకు చేరాయి. 2024 ఏప్రిల్‌లోనే జీఎస్టీ వసూళ్లు రూ.2.10 లక్షల కోట్లకు చేరి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

For Latest News click here

Updated Date - Sep 02 , 2024 | 08:18 AM