Share News

Rahul Gandhi: రాహుల్ అన్నట్టు రామాలయ ఉద్యమం ఓడిందా?

ABN , Publish Date - Jul 11 , 2024 | 02:52 AM

సొంత ప్రతాపం కొంత ఉంటే, జబ్బలు ఎంత చరుచుకున్నా ఒక అందం. అరువు బలం మీద ఆధారపడి, అంతా తమ ప్రతాపం అంటేనే వికారం. మొదటికే మోసం వచ్చినా, మూడోసారి మహాప్రసాదమని మురిసిపోతున్న ప్రధాని మోదీ...

Rahul Gandhi: రాహుల్ అన్నట్టు రామాలయ ఉద్యమం ఓడిందా?

సొంత ప్రతాపం కొంత ఉంటే, జబ్బలు ఎంత చరుచుకున్నా ఒక అందం. అరువు బలం మీద ఆధారపడి, అంతా తమ ప్రతాపం అంటేనే వికారం. మొదటికే మోసం వచ్చినా, మూడోసారి మహాప్రసాదమని మురిసిపోతున్న ప్రధాని మోదీ గురించి కాదు. ఉట్టిని మాత్రమే కొట్టి, స్వర్గం దక్కిందని సంబరపడుతున్న ‘బాలక్’ రాహుల్ గురించి. పొత్తు ఉంటే ఉండొచ్చు కానీ, అయోధ్యలో గెలిచింది తను కాదు, తన పార్టీ కాదు. అయినా, ఆడ్వాణీ ఆరంభించిన రామాలయ ఉద్యమాన్ని తాము అయోధ్యలో ఓడించామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. అదే మాదిరిగా, ఇంకో మూడేళ్లలో గుజరాత్‌లో కూడా బీజేపీని ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు. ఉద్యమ స్థలంలో గెలిచినట్టే, మోదీ స్వరాష్ర్టంలోనూ గెలుస్తామని ఆయన ఉద్దేశం కావచ్చు. గుజరాత్‌లో ఆ కర్తవ్యం నెరవేర్చే మిత్రపక్షమేదో?

అయోధ్యలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అవధేశ్ సింగ్ పాసీ విజయం నిస్సందేహంగా ఒక విశేషమే. ఉధృతంగా ఉన్న భావావేశాన్ని కాదని, నిత్యజీవన సమస్యలు పైచేయి అయిన ఎన్నిక అది. ఒక వైచిత్రి, జనరల్ సీటులో ఒక దళిత అభ్యర్థి, సవర్ణ ప్రత్యర్థులను ఓడించి గెలవడంలో ఒక కవితాన్యాయం కూడా ఉండవచ్చు. కానీ, అయోధ్య అన్నది రామాలయ ఉద్యమంలో కీలకమయిన స్థలం, గమ్యం తప్ప, అదే సర్వస్వం కాదు. రామజన్మభూమి ఉద్యమం అన్నది ఒక ప్రయాణం. సుమారు నాలుగుదశాబ్దాల ప్రయాణం. దాదాపు దేశమంతటా, ఆ ప్రయాణం సాగింది. దాని ప్రభావాలు, పర్యవసానాలు దేశమంతటికీ వ్యాపించి ఉన్నాయి. అయోధ్యలో బీజేపీ ఓడిపోయినంత మాత్రాన, ఆ ఉద్యమం ఓడినట్టు కాదు.


ఆ ఉద్యమ ప్రభావం రాజకీయరంగంలో ఇంతకు మునుపులా ఉండకపోవచ్చు. క్షీణించవచ్చు. లేదా, అది సాధించదలచుకున్న ఫలితాలు సాధించుకున్నది కనుక, అందులో నుంచి రాగలిగిన ఫలసాయం అందింది కనుక, ఇకపై అది ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోవచ్చు. భావావేశాలు ఉపశమించవచ్చును కానీ, భావాలు మిగిలే ఉంటాయి, లోలోపలికి ఇంకి ఉంటాయి. సమాజం ఆలోచనల్లో, ఎంపికల్లో, వ్యవహారసరళిలో అవి పనిచేస్తూనే ఉంటాయి. రేపు, మధుర, కాశీ స్థలాల్లో అదే రకమైన ప్రయత్నాలు మొదలయితే, అయోధ్య జ్ఞాపకం కూడా దానికి ప్రేరణ అవుతుంది.

ఒకనాటి ఘనభారతం మధ్యయుగాలలో విదేశీయుల, ముఖ్యంగా ముస్లిముల, ఆక్రమణలకు లోనై భంగపడిందని, ఆ కుంగుబాటు నుంచి హిందువులను ఆత్మవిశ్వాసంలోకి ఉద్ధరించాలని, స్వాతంత్ర్యానంతరం పాలించిన ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు విమత, విజాతి శ్రేణులను బుజ్జగిస్తూ వచ్చాయని, మతజాతీయత నిర్మాణం ద్వారా ధర్మాన్ని, దేశాన్ని పటిష్ఠం చేయాలని విశ్వసించే ఆలోచనల, ఆచరణలలో భాగమే రామమందిర ఉద్యమం. బాబ్రీమసీదు విధ్వంసం కానీ, ఆ స్థలంలో నిర్మితమైన నూతన రామాలయం కానీ గాయపడిన జాతిగౌరవానికి జరిగిన ప్రతిన్యాయంగా ఆ ఉద్యమ శ్రేణులు భావిస్తాయి. బాబర్ ద్వారా ఒకనాటి రామజన్మభూమి ఆలయం ధ్వంసమైందన్న వివాదం చరిత్రకు, పురాతత్వ శాస్త్రానికి సంబంధించినది. కాగా, ఆధునిక కాలంలో వలస ఆలోచనావిధానం, సామ్యవాదులు, ఉదారవాదుల వల్ల భారతీయ భావధార, సంస్కృతి అణగారిపోతున్నాయని, విమతస్థుల నుంచి మెజారిటీ మతస్థులకు ప్రమాదం పొంచి ఉన్నదని తీవ్ర జాతీయవాదం అనుకుంటుంది. ఈ చారిత్రక, సమకాలిక కథనాలు సమన్వయంతో సాగి, ఆ ఆలోచనలకు విస్తృతమైన మద్దతు కూడగట్టాయి. ఇంకా అనేక ఇతర అనుబంధకారణాలు కూడా పనిచేసి, 1984లో రెండు లోక్‌సభ స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీని, 2014లో 282 స్థానాల విజయానికి చేర్చింది. ఇప్పుడు ఈ స్థానాలు దిగువకు పడిపోయినంత మాత్రాన, దేశమంతటా ప్రజలలో జీర్ణించుకుపోయిన ఆలోచనలు పలచబడినట్టు కాదు.


లౌకిక వాదం అంటే చెరో బుజ్జగింపు, చెరొక బెదిరింపు అని కాంగ్రెస్ అప్పటికీ ఇప్పటికీ నమ్ముతుంది. షాబానో కేసులో ముస్లిం మతవాద, సామాజిక ఛాందసులను మెప్పించడానికి చట్టసవరణ చేసిన రాజీవ్ గాంధీ, దానికి సమతూకం కింద నిద్రావస్థలో ఉన్న అయోధ్య వివాదాన్ని నిద్రలేపారు. రామాలయ ఉద్యమానికి ఘనతను ఆడ్వాణీకి ఇచ్చారు కానీ, రాహుల్ తండ్రికి కూడా ఆ కీర్తిలో వాటా ఉంది. 1986 నుంచి మొదలై, కరసేవలు, రథయాత్రలు, ప్రభుత్వ పతనాలు, కూల్చివేతలు, కోర్టు కేసులు, పేలుళ్లు, ఘర్షణలు, రైలుబోగీ దగ్ధాలు, దారుణ ఊచకోతలు, ఈ వివాదం దారిలో మైలురాళ్లుగా ఉన్నాయి. సుమారు నాలుగువేల మంది సంబంధిత హింసాకాండలో చనిపోయారు. ఇంతటి తగవునూ న్యాయస్థానాలు భూమి తగాదాగా భావించి, తోచిన విధంగా పరిష్కరించాయి. ఈ కల్లోల ప్రయాణం చివర రామాలయ నిర్మాణం ఒక పక్షానికి ఘన విజయమే. ఒక ఆరాటం నెరవేరింది. పోరాటం ముగిసింది. ఫైజాబాద్ ఎన్నికలో బీజేపీ గెలవనంత మాత్రాన, ఉద్యమమే ఓడిపోయిందని ఎట్లా అంటారు?

రాహుల్ గాంధీ ఏదో పొరపాటు మాట్లాడాడని కాదు, పొరపాటు అవగాహనతో ఉన్నారన్నది ‍సమస్య. ఎన్నికల విజయాలు, సైద్ధాంతిక విజయాలని, తాము అధికారంలోకి రావడమే ప్రజలకు విముక్తి అని ఆయన అనుకుంటే, ఇప్పుడు పెరుగుతున్న జనాభిమానం ఎంతో కాలం నిలవదు. కొద్దిపాటి విజయాలనే, అతిగా ఊహించుకుని ప్రగల్భించడం రాజకీయాలలో వివేకం అనిపించుకోదు. మోదీ పరివారం తనను ‘పప్పు’ అని గేలిచేసినప్పుడు, ‘పప్పు’ లాగా, ఇప్పుడు ‘బాలకుడ’ని తీసిపారేస్తున్నప్పుడు, నిజంగానే బాల్యచాపల్యంతోను రాహుల్ గాంధీ ఉన్నారేమో అనిపిస్తోంది. పిల్లవాడేమీ కాదు, సాంకేతికంగా చూస్తే యువకుడూ కాదు, కానీ, రాహుల్ గాంధీలో పరవళ్లు తొక్కే ఉత్సాహం ఉన్నమాట నిజం. ఆ ఉత్సాహం కొన్నిసార్లు అత్యుత్సాహంగా వ్యక్తమై, వెక్కిరింతలకు ఆస్కారం ఇస్తోంది. బీజేపీ హేళనలు వినోదం కోసం రూపొందించినవి కావు. వాటి వెనుక చాలా అర్థముంది. అసమర్థుడని చెప్పడానికి పప్పు అన్న మాటను ఉపయోగించారు. ఇటీవలి రాహుల్‌ను చూశాక, ఆ మాటకు కాలం చెల్లిందని అర్థమైంది. అందుకని, కొత్తగా అపరిపక్వుడనే అర్థంలో ‘బాలక్’ను ప్రయోగిస్తున్నారు. ఆయన ఆలోచనలు, మాటలు ఇట్లాగే కొనసాగితే, మోదీ కాదు, ప్రజలు కూడా ఆయనను బాలకుడనే అనుకుంటారు.


లోక్‌సభలో మాట్లాడుతూ, శివుడి బొమ్మను ప్రదర్శిస్తూ, సర్వమతాల్లోని అభయముద్ర గురించి వివరిస్తున్నప్పుడు, రాహుల్ గాంధీ ప్రయత్నం, తపన నచ్చినట్టుగా, అందులోని విషయం ఆకట్టుకోలేదు. మతాలకు, ముఖ్యంగా హిందూమతానికి తాను వ్యతిరేకిని కాదని చెప్పుకోవడంతో పాటు, మతబోధనలలో నుంచి హింసాద్వేషాలను వ్యతిరేకించడమనే చట్రంలో ఆయన మాట్లాడారు. ఇంతగా ప్రయాసపడీ, ప్రసంగం చివరలో మాట్లాడిన మాటలు ప్రభుత్వపక్షానికి ఆయుధాలు అందించాయి. రాహుల్ తప్పుగా మాట్లాడారని కాదు. ప్రత్యక్ష ప్రసారాలు చూసినవారందరికీ తెలుసు, ఆయన హిందువులందరినీ హింసావాదులు అనలేదు. హిందువులమని చెప్పుకునే వారు, హింసను ఆచరిస్తున్నారంటూ, తాను ఆ మాటలను బీజేపీని, ఆర్ఎస్ఎస్‌ను దృష్టిలో పెట్టుకుని అంటున్నానని చెప్పారు. ప్రకటనలో వివాదం తొంగిచూస్తున్నప్పుడు, ఆ మాటల చివరలో ఉన్న వివరణను ఎవరు పట్టించుకుంటారు? రాహుల్ హిందువులను అందరినీ ఉద్దేశించి ఆ మాటలు అన్నారన్న వాదన బిగ్గరగా వినిపించసాగింది. అనుభవజ్ఞుడైన, పరిపక్వత కలిగిన నాయకుడు తప్పుగా మాట్లాడకపోవడమే కాదు, తప్పుగా వ్యాఖ్యానించడానికి ఆస్కారం కూడా ఇవ్వకూడదు. ఆ నాటి రాహుల్ ప్రసంగం దేశవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుంది, కానీ, ఆ ఆకర్షణ ముందు తాము చిన్నబోకుండా, ఈ హింసావివాదం బీజేపీని రక్షించింది.

బీజేపీ సొంతంగా మెజారిటీ దక్కించుకోలేకపోయిందన్న విషయానికి రాహుల్ కొంతకాలం విశ్రాంతి ఇవ్వడం మంచిది. దాని మీద ఇప్పటికే చాలా మాట్లాడారు. ఇక చాలు. కాంగ్రెస్, ఇండియా కూటమిలోని ఇతర పక్షాలు, ఈ ఎన్నికల్లో నిరూపించిన విషయమేమిటంటే, నరేంద్రమోదీని బలహీనపరచడం అసాధ్యమేమీ కాదని. తన విజయం బేషరతుదేమీ కాదని, తాను అజేయుడేమీ కాదని నరేంద్రమోదీ కూడా తెలుసుకునే ఉంటారు. తమ విజయాలను మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రతిపక్ష కూటమి, తన అపజయాన్ని అధిగమించడానికి మోదీ ప్రయత్నించాలి. ఎవరు పొరపాట్లు చేసినా, అవి వారి అవకాశాలను దెబ్బతీస్తూ పోతాయి. ద్వేషపు సంతలో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నామని చెప్పిన రాహుల్ గాంధీ, జోడో యాత్రలలోను, పార్లమెంటులోను, ఎన్నికల ప్రచారంలోను మెరుపు ప్రచారం కాకుండా, క్షేత్రస్థాయిలో తమ పార్టీ యంత్రాంగం చేత సామరస్య, సోదరత్వ కృషి చేయించాలి. రాహుల్ నీతివచనాలు ఒక తీరుగా, కాంగ్రెస్ నేతల ఆచరణలు మరొక రీతిగా ఉంటే, బాలక బిరుదు పోయి, ద్వంద్వత్వ విమర్శలు ఎదురవుతాయి. ఇప్పటికే, రాహుల్ మాట, కాంగ్రెస్ చేత గురించిన ప్రచారం ఢిల్లీలో బలంగానే మొదలయింది.

కె. శ్రీనివాస్

Updated Date - Jul 11 , 2024 | 10:20 AM