Morning Routine: ఉదయాన్నే నిద్ర మత్తు వదలడం లేదా... ఇలా చేయండి..
ABN , Publish Date - Nov 18 , 2024 | 10:05 AM
చలికాలంలో నిద్రలేవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకవేళ లేచినా.. నిద్రమత్తు అంత ఈజీగా వదలదు. అయితే, ఈ మత్తు నుండి బయటకు రావాలంటే .. వీటిని పాటించాలని నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.
Morning Routine: చలికాలంలో ఉదయాన్నే నిద్ర లేవంటే చాలా కష్టం. ఒకవేళ లేచినా నిద్ర మత్తు సులువుగా వదలదు. ఇంకొంత మందికి నిద్రలేవగానే కాస్త అలసటగా ఉంటుంది. కొంతమంది అలారాన్ని స్నూజ్ చేసి.. ఇంకా కొంచెం సేపు నిద్రపోదాం.. ఆలస్యంగా లేద్దాములే అనుకుంటూ అలానే పడుకుని పోతారు. మరి కొందరు బలవంతంగా లేస్తూ నిద్రమత్తులోనే రెడీ అవుతూ ఆ డేని స్టార్ట్ చేస్తారు. ఆ నిద్రమత్తు మనల్ని అంత ఈజీగా వదిలిపోదు. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? వీటిని పాటిస్తే ఉదయం అలసట పోయి.. నూతన ఉత్తేజంతో డేని ప్రారంభించవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.
అలారాన్ని స్నూజ్ చేయకండి..
ముందుగా మీ డే హ్యాపీగా స్టార్ట్ అవ్వాలంటే అలారాన్ని స్నూజ్ చేయకుండా.. అది మోగిన వెంటనే నిద్రలేవండి. కొంచెం ఎక్కువసేపు నిద్రించడానికి అలారాన్ని తాత్కాలికంగా ఆపివేస్తే మీరు అలారంను మళ్లీ మళ్లీ స్నూజ్ చేయడం వల్ల మరింత అలసిపోయే అవకాశం ఉంది.
గ్లాస్ నీటితో డే స్టార్ట్ చేయండి..
హైడ్రేటెడ్ గా ఉండటానికి, ఉదయం బద్ధకాన్ని దూరం చేయడానికి మీరు నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీరు తాగి ఫ్రెష్ అప్ అవ్వండి. ఈ నీరు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.
వ్యాయామం చేయండి..
ఉదయాన్నే సూర్యకాంతిని పొందడం చాలా ముఖ్యం. కాసేపు వాకింగ్ చేసి ఎండలో నడవండి. ఉదయాన్నే సూర్యరశ్మికి గురికావడం వల్ల మెదడులో సెరోటోనిన్‌ని పెంచి మరింత శక్తివంతంగా ఉంచుతుంది. వాకింగ్ చేయడం కుదరకపోతే.. కిటికీ లేదా బాల్కనీ ద్వారా సూర్యరశ్మి వచ్చే ప్లేస్‌లో మీరు కాసేపు కుర్చోండి. ఉదయాన్నే సూర్య నమస్కారాలు, స్ట్రెచింగ్ వ్యాయామాలు సుమారు 25 నిమిషాలు చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
చల్లని నీటితో స్నానం..
చలికాలంలో చల్లని నీటితో స్నానం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. అయినా సరే చన్నీటితో స్నానం చేయండి. ఇలా చన్నీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడి, అలసట, కండరాల నొప్పులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ శరీరంలో ఉష్ణోగ్రత మార్పును సూచించడానికి ముఖంపై చల్లటి నీటిని కూడా చల్లుకోవచ్చు.
బెడ్ కాఫీకి నో చెప్పండి..
చాలా మంది ఉదయం నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగుతారు. కానీ అలా చేయడం మంచిది కాదు. ముందుగా నిద్ర లేవగానే బెడ్ కాఫీకి నో చెప్పండి. కాఫీ తాగడం వల్ల అలసట ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఓట్స్, గుడ్లు, గింజలు లేదా తృణధాన్యాలు, తక్కువ చక్కెర కలిగిన పండ్లు, తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది.)
Also Read: