Kitchen Tips: మిగిలిపోయిన చపాతీ పిండిని ఇలా స్టోర్ చేసుకోండి.. ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది..
ABN , Publish Date - Nov 08 , 2024 | 05:06 PM
ప్రతి ఇంట్లో చపాతీలు చేయగా ఎంతో కొంత చపాతీ పిండి మిగిలిపోతుంది. దీన్ని ఫ్రిజ్ లో నిల్వ చేయడం మామూలే.. కానీ ఇది ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
చపాతీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రోజూ చపాతీ పెట్టినా హాయిగా తినేవాళ్లు ఉన్నారు. అయితే తిన్నంత సులభంగా చపాతీలు చేయడం సాధ్యం కాదు. పిండిని కలిపి, వాటిని ఒత్తుకుని, ఆ తరువాత కాల్చాలి. అయితే ఎప్పుడూ ఒకటే సందేహం.. కలిపిన పిండితో అందరికీ సరిపడా చపాతీలు అవుతాయా లేదా అని.. ఈ కారణంగా చాలామంది చపాతీ పిండిని ఎక్కువగా తయారు చేస్తారు. ఇంటిల్లిపాదికి సరిపడా చపాతీలు అవగానే పిండిని ఏదైనా ఒక బాక్స్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. ఇలా చేస్తే పిండి తొందరగా పాడైపోతుంది. చపాతీ పిండి బంక రావడం, వాసన రావడం కూడా జరుగుతుంది. అలా కాకుండా చపాతీ పిండిని ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే ఈ కింది చిట్కాలు పాటించాలి.
నూనె..
చపాతీని తయారు చేయడానికి పిండిని కలిపేటప్పుడు పిండిలో నూనె లేదా నెయ్యిని కొంచెం ఎక్కువ వెయ్యాలి. ఇది చపాతీలు మృదువుగా ఉంచడంలోనే కాకుండా మిగిలిన చపాతీ పిండి ఎక్కువ సేపు నిల్వ ఉండటంలో కూడా సహాయపడుతుంది.
అల్యూమినియం ఫాయిల్..
చపాతీ పిండిలో ఉన్న తేమ కోల్పోకుండా ఉండటానికి చపాతీ పిండిని అల్యూమినియం ఫాయిల్ లో చుట్టాలి. తరువాత దీన్ని ఒక కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేయడం వల్ల చపాతీ పిండి ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
ఎయిర్ టైట్ కంటైనర్..
మిగిలిన చపాతీ పిండి పాడవకుండా ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఎయిర్ టైట్ కంటైనర్ లలో నిల్వ చేయాలి. ఇది గాలి చొరబడకుండా.. చపాతీ పిండిలో తేమ కోల్పోకుండా ఉంచుతుంది. అయితే చపాతీ పిండిని శుభ్రమైన గుడ్డలో చుట్టిన తరువాత ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి.
జిప్ లాక్ కవర్లు..
జిప్ లాక్ కవర్లలో చాలా పదార్థాలు నిల్వ చేస్తుంటారు. దీని వల్ల అవి పాడవ్వవు. చపాతీ పిండిని కూడా జిప్ లాక్ కవర్లలో నిల్వ చేసుకోవచ్చు. మిగిలిన చపాతీ పిండిని జిప్ లాక్ కవర్ లో వేసి అందులో గాలిని పూర్తీగా తొలగించి జిప్ లాక్ వేసి ఫ్రిజ్ లో ఉంచాలి. ఇది ఎక్కువ కాలం చపాతీ పిండి తాజాగా ఉండేలా చేస్తుంది.
తేమ..
తొందర పాటులో మిగిలి పోయిన చపాతీ పిండిని చల్లని, తేమగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేయకూడదు. ఫ్రిజ్ లో పొడిగా ఉన్న కంటైనర్ లేదా కవర్ వంటి వాటిలోనే ఉంచాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
Coper Bottles: రాగి వాటర్ బాటిల్స్ వాడుతుంటారా.. వాటిని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి..