ఒక్కొక్కరు 10 దొంగ ఓట్లేయండి
ABN , Publish Date - Oct 07 , 2024 | 03:25 AM
అసలే అమెరికా ఎన్నికలు.. అందులోనూ వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలు చేసే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ మరోసారి పోటీ..! ఆయనకు అపర కుబేరుడు, సామాజిక మాధ్యమం ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ మద్దతు..!
ఎలాన్ మస్క్ తల్లి మాయె మస్క్ వివాదాస్పద ట్వీట్
న్యూయార్క్, అక్టోబరు 6: అసలే అమెరికా ఎన్నికలు.. అందులోనూ వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలు చేసే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ మరోసారి పోటీ..! ఆయనకు అపర కుబేరుడు, సామాజిక మాధ్యమం ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ మద్దతు..! ఇలాంటి పరిస్థితుల్లో మస్క్ తల్లి మాయె (76) చేసిన ట్వీట్ సంచలనం రేపింది..! ‘నకిలీ పేర్లతో ఒక్కొక్కరు 10దొంగ ఓట్లేయండి.. పోలింగ్ రోజున పది బూత్‌లకు వెళ్లి హక్కును వినియోగించుకోండి.. అప్పుడు 100ఓట్లు అవుతాయి.
ఇదేమీ తప్పు కాదు’ అని సూచించారు. మాయె ట్వీట్‌ను 2.5 లక్షల మంది చూశారు. అయితే చాలామంది దీనిపై తీవ్రంగా స్పందించారు. అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ), ఫెడరల్ ఎన్నికల సమాఖ్య జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మాయె ఎన్నికల్లో అక్రమాలను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎఫ్‌బీఐని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. కాగా, మాయె ట్వీట్ అమెరికా ఎన్నికల ప్రవర్తనా నియమాళికి విరుద్ధంగా ఉందంటూ ‘ఎక్స్’ కమ్యూనిటీ నోట్ జారీ చేసింది. అనంతరం మాయె ట్వీట్‌ను ఉపసంహరించుకున్నారు.
ట్రంప్ సభలో మస్క్
పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జూలైలో తనపై తుపాకీ కాల్పులు జరిగిన ప్రదేశంలోనే డొనాల్డ్ ట్రంప్ తాజాగా బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. ‘‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్-మాగా (అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం)’’ అనే శీర్షిక ఉన్న టోపీ, ‘‘మార్స్‌ను ఆక్రమిద్దాం’’ అని రాసిన టీ షర్ట్ వేసుకున్న ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.