Iran v/s Israel War : పశ్చిమాసియా ఉద్రిక్తం!
ABN , Publish Date - Aug 04 , 2024 | 01:59 AM
అసలే ఉద్రిక్తతలకు నెలవైన పశ్చిమాసియాలో ఓవైపు హమా్‌స-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుండగానే, మరో యుద్ధం తప్పదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధంగా ఇరాన్
ఉగ్ర సంస్థ హెజ్బొల్లాకు పూర్తి మద్దతు
ఇజ్రాయెల్‌కు అండగా రంగంలోకి అమెరికా
యుద్ధ నౌక, జెట్లను పంపుతున్న అగ్రరాజ్యం
భారత పౌరులను అప్రమత్తం చేసిన ఎంబసీలు
విమాన సర్వీసులను రద్దు చేస్తున్న పలు సంస్థలు
మరో యుద్ధం అంచున పశ్చిమాసియా!
టెల్ అవీవ్, ఆగస్టు 3: అసలే ఉద్రిక్తతలకు నెలవైన పశ్చిమాసియాలో ఓవైపు హమా్‌స-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుండగానే, మరో యుద్ధం తప్పదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్‌పై దాడికి సిద్ధమవుతోంది. మిత్ర దేశాలతో కలిసి విరుచుకుపడే ఆలోచన చేస్తోంది. ఒకేసారి అందరూ కలిసి దాడి చేయడమా? లేక విడివిడిగానా? అనేది చర్చల్లో ఉంది. దీంతో ఇరాన్ బద్ద శత్రువైన అమెరికా రంగంలోకి దిగింది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్ చేసి మద్దతు తెలిపారు. అగ్ర రాజ్యం అదనపు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపేందుకు సిద్ధమైంది.
ఈ మేరకు బాలిస్టిక్ క్షిపణలను నిరోధించగల క్రూయిజర్లు, యుద్ధ విమానాలను తరలించేందుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశిలిచ్చారు. పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్న విమాన వాహక నౌక యూఎ్‌సఎస్ థియోడర్ రూజ్‌వెల్ట్ స్థానంలో యూఎ్‌సఎస్ అబ్రహం లింకన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రినా సింగ్ తెలిపారు.
కాగా, గత మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్‌లో తమ కమాండర్ ఫాద్ షుకూర్‌ను ఇజ్రాయెల్ హతమార్చడంతో ఉగ్ర సంస్థ హెజ్బొల్లా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇక హనియా హత్యకు భీకరమైన సైనిక ప్రతీకారం తప్పదని యెమెన్‌కు చెందిన హూతీ ఉగ్రవాదులూ ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌ను అడ్డుకునేందుకు పశ్చిమాసియాలో సైనిక శక్తిని పెంచుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తెలిపింది. మరోవైపు టెల్ అవీవ్‌కు ఎయిరిండియా సహా పలు విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి.
భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్‌లోని రాయబార కార్యాలయం కోరింది. ముందు రోజే బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇదే విధమైన హెచ్చరిక చేసింది. వీలైతే లెబనాన్ నుంచి వెళ్లిపోవాలని కూడా కోరింది. మరోవైపు, లెబనాన్‌లో ఉన్న తమ పౌరులు వెంటనే, ఏ టికెట్ దొరికితే ఆ టికెట్‌తో స్వదేశాలకు వచ్చేయాలని అమెరికా, యూకే సూచించాయి.