మానవత్వంతోనే విజయం.. యుద్ధాలతో కాదు
ABN , Publish Date - Sep 24 , 2024 | 02:49 AM
న్యూయార్క్, సెప్టెంబరు 23: సమష్టి శక్తి, మానవత్వంతోనే విజయం సాధ్యమని.. యుద్ధాలతో కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్ ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుందని వివరించారు.
ఉగ్రవాదంతో ప్రపంచ శాంతికి ముప్పు
సైబర్, మారిటైమ్, అంతరిక్షం విషయంలో.. సవాళ్లు, ముప్పును ఉమ్మడిగా ఎదుర్కొందాం
భారత్‌లో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తున్నాం
ఈ విజయాల్ని ప్రపంచంతో పంచుకుంటాం
ఐరాస సర్వసభ్య సమావేశంలో మోదీ
‘ఒక భూగోళం.. ఒక కుటుంబం..
ఒక భవిష్యత్’పై నినాదం
పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌తో మోదీ భేటీ
దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశం
యుద్ధాలతో కాదు.. సమష్టి శక్తి, మానవత్వంతోనే విజయం సాధ్యం. భారత్ ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుంది. మానవాళి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచనేతల చర్యలు ఉండాలి. టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా నియంత్రణ ఉండాలి. భద్రత, బాధ్యతతో కూడిన వినియోగం అవసరం. డిజిటల్ ప్రజావనరులను మంచికే వినియోగించాలి. భారత్ తన డిజిటల్ వనరులను ప్రపంచంతో పంచుకునేందుకు సిద్ధంగా ఉంది. ఒక భూగోళం.. ఒక కుటుంబం.. ఒక భవిష్యత్’ అనే నినాదానికి మేం కట్టుబడి ఉన్నాం. అందుకే.. ‘ఒక భూగోళం.. ఒక ఆరోగ్యం’, ‘ఒక సూర్యుడు.. ఒక గ్రిడ్’ దిశగా సాగుతున్నాం.
- ప్రధాని నరేంద్ర మోదీ
ప్రపంచ శాంతికి ఉగ్రవాదంతో పెను ముప్పు
న్యూయార్క్, సెప్టెంబరు 23: సమష్టి శక్తి, మానవత్వంతోనే విజయం సాధ్యమని.. యుద్ధాలతో కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్ ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుందని వివరించారు. ప్రపంచ మానవాళి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచనేతల చర్యలు ఉండాలని అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన ఐక్య రాజ్య సమితి(ఐరాస) సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. ప్రపంచ దేశాలు భవిష్యత్ గురించి మానవ-కేంద్ర విధానాలను అనుసంరించాలని పేర్కొంటూ.. ‘ఒక భూగోళం.. ఒక కుటుంబం.. ఒక భవిష్యత్’ అని నినదించారు. ‘‘మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల క్రతువు ఇటీవల భారత్‌లో ముగిసింది.
ప్రజలు మాకు మూడోసారి అధికారమిచ్చారు. మేం గడిచిన పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధిస్తూ.. పేదరికం, మానవాభివృద్ధి, పేదల సంక్షేమం, ఆహార పంపిణీ అనే అంశాలపై ప్రధానంగా దృష్టిసారించడం వల్ల ఈ ఘనత సాధ్యమైంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ శాంతి, భద్రత పాలిట ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్, మారిటైమ్, అంతరిక్ష రంగాల్లో కొత్త సవాళ్లు, ముప్పులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ‘‘టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా నియంత్రణ ఉండాలి. భద్రత, బాధ్యతతో కూడిన వినియోగం అవసరం. డిజిటల్ ప్రజావనరులను మంచికే వినియోగించాలి’’ అని పేర్కొన్నారు. ‘ఒక భూగోళం.. ఒక కుటుంబం.. ఒక భవిష్యత్’ అనే నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అందుకే.. ‘ఒక భూగోళం.. ఒక ఆరోగ్యం’, ‘ఒక సూర్యుడు.. ఒక గ్రిడ్’ దిశగా సాగుతున్నామన్నారు. ప్రపంచాన్ని సుసంపన్నం చేసేందుకు భారత్ తన ఆలోచనలను నిబద్ధతతో పంచుకుంటుందని వివరించారు.
మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతాం
భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అమెరికా దిగ్గజ కంపెనీల సీఈవోలతో ఆయన ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంఐటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ విద్యా సంస్థ ప్రొఫెసర్ అనంత చంద్రశేఖరన్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పలు సంస్థల సీఈవోలు సుందర్‌పిచాయ్(గూగుల్), జెన్సెన్ హంగ్(ఎన్‌విడియా), శంతను నారాయణ్(అడోబ్), లిసా సు(ఏఎండీ), అర్వింద్ కృష్ణ(ఐబీఎం), ఎన్రిక్ లోర్స్(హెచ్‌పీ) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఐదో ఆర్థిక శక్తిగా ఉన్న భారత్.. 3.9 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరుకున్నట్లు వివరించారు. 7ు వృద్ధి రేటును స్థిరంగా కొనసాగిస్తూ.. త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్ టెక్నాలజీల్లో భారత్‌కు సహకరించాలని కంపెనీల సీఈవోలను కోరారు.
నేపాల్‌కు రండి.. మోదీకి ఓలి ఆహ్వానం
ప్రధాని మోదీని నేపాల్ రావాల్సిందిగా ఆ దేశ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి ఆహ్వానించారు. ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేపాల్‌కు రావాల్సిందిగా ఓలి ఆహ్వానించగా.. మోదీ సమ్మతించారు. మరోవైపు కువైత్ యువరాజు షేక్ సబా ఖాలిద్ అల్-సబాతోనూ మోదీ భేటీ అయ్యారు.
యుద్ధం ముగియాలి.. శాంతి నెలకొనాలి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగిసి, గాజాలో శాంతి నెలకొనాలని మోదీ ఆకాంక్షించారు. న్యూయార్క్‌లోని పాలెస్ హోటల్‌లో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బా్‌సతో జరిగిన భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలో మానవతాసాయానికి భారత్ తన వంతు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఐరాస అనుబంధ సంస్థ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ద్వారా రూ.21 కోట్ల(2.5 మిలియన్ డాలర్లు) విలువైన సాయాన్ని అందించామని గుర్తుచేశారు. గాజాలో ప్రస్తుత పరిస్థితులు, మానవ సంక్షోభం, భద్రతపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్-పాలస్తీనా స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరువురు నేతలు ఆకాంక్షించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జైస్వాల్ వెల్లడించారు.