AAP vs Congress: 'ఇండియా' కూటమిలో సీఎం వ్యాఖ్యల చిచ్చు...కస్సుమన్న కాంగ్రెస్
ABN , Publish Date - Jan 02 , 2024 | 05:54 PM
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ''కాంగ్రెస్ ఒకప్పుడు ఉండేది'' అంటూ తల్లులు తమ పిల్లలకు చెప్పుకుంటారంటూ పంజాబ్ ముఖ్యమంత్రి భగ్‌వంత్ మాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఆప్‌ను విశ్వసించలేమని, ఆ పార్టీ సుప్రీం అరవింద్ కేజ్రీవాల్‌కు కూటమి రాజకీయాలపై అవగాహనం లేదని మండిపడింది.
న్యూఢిల్లీ: 'ఇండియా' (I.N.D.I.A.) కూటమిలో భాగస్వామిగా ఉన్న 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP), కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ''కాంగ్రెస్ ఒకప్పుడు ఉండేది'' అంటూ తల్లులు తమ పిల్లలకు చెప్పుకుంటారంటూ పంజాబ్ ముఖ్యమంత్రి భగ్‌వంత్ మాన్ (Bhagwant Mann) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. భాగస్వామిగా ఆప్‌ను విశ్వసించలేమని, ఆ పార్టీ సుప్రీం అరవింద్ కేజ్రీవాల్‌కు కూటమి రాజకీయాలపై అవగాహనం లేదని మండిపడింది.
వివాదం ఇలా మొదలైంది...
ఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ చరిత్రలోకి వెళ్లిపోయిందని భగవంత్ మాన్ సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఆప్‌తో పొత్తుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విముఖత చూపుతున్నారనే వార్తలపై మీడియా ప్రశ్నించినప్పుడు... ''తల్లులు తమ పిల్లలకు కథలు చెప్పేటప్పుడు ఒకానొకప్పుడు పంజాబ్, ఢిల్లీలో కాంగ్రెస్ ఉండేదంటూ చెప్పుకుంటారు'' అంటూ ఆయన చమత్కరించారు. ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్థానే ఆప్ ప్రస్తుతం అధికారంలోఉంది.
తీహార్ జైలులో కనిపించే పార్టీ ఆప్: సందీప్ దీక్షిత్
భగవంత్ మాన్ వ్యాఖ్యలను ఢిల్లీ మాజీ ఎంపీ సంజయ్ దీక్షిత్ ఘాటుగా తిప్పికొట్టారు. ఆప్‌ను విశ్వసించలేమని, కూటిమి రాజకీయాలపై కేజ్రీవాల్‌కు అవగాహన లేదని అన్నారు. ''ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉందా లేదా అనేది ఆప్‌కే తెలుసు. ఆప్‌ను నమ్మలేమని మేము తరచు చెబుతూనే ఉన్నాం. ఇండియా కూటమిలో ఉండాలని వాళ్లు (ఆప్) కోరుకుంటే ఇతర పార్టీలతో కలిసి పనిచేయాలి'' అన్నారు. కాంగ్రెస్ ఒకప్పుడు ఉండేదంటూ పంజాబ్ సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, రాబోయే రోజుల్లో తల్లులు తమ పిల్లలకు గతంలో ఒక పార్టీ ఉండేదని, అది ప్రస్తుతం తీహార్ జైలులో ఉందని చెబుతారని అన్నారు. 40 శాతం మంది నేతలు జైలులోను, తక్కిన నేతలు త్వరలో కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న పార్టీ ఏదో చెప్పండి? అని ఆయన ప్రశ్నించారు.