Share News

Asaduddin Owaisi: మీ తప్పిదాల వల్లే బీజేపీ గెలిచింది.. కాంగ్రెస్‌పై ఒవైసీ ఫైర్

ABN , Publish Date - Oct 09 , 2024 | 05:38 PM

హర్యానాలో తమ ఓటమికి ఈవీఎంలను కాంగ్రెస్ తప్పుపట్టడంపై అసదుద్దీన్ ఒవైసీ ఆక్షేపణ తెలిపారు. ఈవీఎంలను తప్పుపట్టడం చాలా సులభమని, ఈవీఎంల వల్ల మీరు నెగ్గినప్పుడు మాట్లాడరని, ఓడిపోతే మాత్రం ఈవీఎంలను తప్పు పడుతుంటారని అన్నారు.

Asaduddin Owaisi: మీ తప్పిదాల వల్లే బీజేపీ గెలిచింది.. కాంగ్రెస్‌పై ఒవైసీ ఫైర్

న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై గెలుపును చేజేతులారా జారవిడుచుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asadudding Owaisi) బుధవారంనాడు విమర్శలు గుప్పించారు. తమ ఓటమికి ఈవీఎంలను కాంగ్రెస్ తప్పుపట్టడంపై ఆక్షేపణ తెలిపారు. ఈవీఎంలను తప్పుపట్టడం చాలా సులభమని, ఈవీఎంల వల్ల మీరు (కాంగ్రెస్) నెగ్గినప్పుడు మాట్లాడరని, ఓడిపోతే మాత్రం ఈవీఎంలను తప్పు పడుతుంటారని అన్నారు.

Haryana: కాంగ్రెస్‌ను ఓడించింది.. బీజేపీని గెలిపించింది ఆ ఇద్దరే..


''ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయేందుకు అనేక ప్రతికూల అంశాలు ఉన్నాయి. హర్యానాలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాల వల్లే బీజేపీ గెలిచింది. పరిస్థితిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంది'' అని ఒవైసీ విశ్లేషించారు. పదేళ్ల బీజేపీ పాలనలో ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా ఉపయోగించుకుని ఉండాల్సిందని, కానీ ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు బీజేపీకి లబ్ధి చేకూర్చాయని అన్నారు. బీజేపీకి ఏ చిన్న అవకాశం ఇచ్చినా ఎన్నికల్లో దానిని తమకు అనూకులంగా మార్చుకుంటుందని చెప్పారు.


బీజేపీ విజయానికి విద్వేష ప్రచారమే కారణమని అనడం సరికాదని 2024 పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా తాను చెప్పానని, సమయం వచ్చినప్పుడు కూడా తాను తరచు ఈ విషయం చెబుతూనే ఉంటానని అన్నారు. ''మరి బీజేపీ విజయానికి కారణం ఎవరు? మీరే (కాంగ్రెస్) ప్రధాన విపక్షంగా ఉన్నారు. బీజేపీని ఓడించే సువర్ణావకాశం మీకు ఉంది. కానీ ఆ అవకాశం ఉపయోగించుకోవడంలో మీరు విఫలం అయ్యారు" అని కాంగ్రెస్ పార్టీని ఒవైసీ తప్పుపట్టారు.


హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ ఏమంది?

హర్యానా ఫలితాలను తాము అంగీకరించడం లేదని, అనేక చోట్ల పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ఈవీఎం తప్పిదాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ నేతలు పలువురు ఆరోపించారు. హిసార్, మహేంద్రగఢ్, పానిపట్‌లలో 99 శాతం బ్యాటరీ ఉన్న మిషీన్లతో బీజేపీ గెలిచిందని, కాంగ్రెస్ 60-70 బ్యాటరీ లెవల్స్‌ ఉన్న ఈవీఎంలతో గెలిచిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం వివిధ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, వాటిని భారత ఎన్నికల కమిషన్ దృష్టికి తెస్తామని చెప్పారు. కాగా, ఫలితాలను అప్‌డేట్ చేయడంలో జాప్యం జరిగిందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఇప్పటికే ఆరోపణలను చేయగా, వాటిని ఈసీఐ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలని కొట్టిపారేసింది.


For More National News and Telugu News..

ఇది కూడా చదవండి..

Exit Polls Fail: సర్వే సంస్థల అంచనాలు బోల్తా.. ప్రజల నాడి పసిగట్టడంతో విఫలం..

Haryana: బీజేపీకి పెరిగిన బలం.. సావిత్రి జిందాల్ సహా ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతు

Updated Date - Oct 09 , 2024 | 06:09 PM