Bangalore: బీబీఎంపీ ఇక.. గ్రేటర్ బెంగళూరు అథారిటీ..
ABN , Publish Date - Jul 24 , 2024 | 01:25 PM
ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు విస్తరిస్తున్న బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP))ను పాలనా సౌలభ్యాల కోసం విభజించాలనే ప్రక్రియకు తుదిరూపు దిద్దారు. గతంలో 3 లేదా 5 భాగాలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఏకంగా మూడు విడతల పాలనా వ్యవస్థ, గరిష్టంగా 10 పాలికెలను అనుసంధానం చేసుకుని గ్రేటర్ బెంగళూరు పాలనా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- ఐదు జోన్లు.. 400 వార్డులు
- కేబినెట్ నిర్ణయం
- శాసనసభ ఆమోదమే తరువాయి
- ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే...?
బెంగళూరు: ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు విస్తరిస్తున్న బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP))ను పాలనా సౌలభ్యాల కోసం విభజించాలనే ప్రక్రియకు తుదిరూపు దిద్దారు. గతంలో 3 లేదా 5 భాగాలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఏకంగా మూడు విడతల పాలనా వ్యవస్థ, గరిష్టంగా 10 పాలికెలను అనుసంధానం చేసుకుని గ్రేటర్ బెంగళూరు పాలనా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఐదు జోన్లు, 400 వార్డులుగా విభజిస్తారు. శాసనసభ ఉభయసభలు ఆమోదించడమే తరువాయిగా ఉంది. బీబీఎంపీని విభజించి ఐదు పాలికెలుగా చేయాలనే గత ప్రస్తావనకు మార్పు చేసి మహానగరంలోని అన్ని ప్రదేశాలను విలీనం చేసుకుంటూ సమతుల్యమైన అభివృద్ధి కోసం గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) ఏర్పాటు చేయాలనే బిల్లును సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) అధ్యక్షతన బిల్లు ఏర్పాటుకు కమిటీ సిద్ధం కానుంది. బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి సదరు కమిటీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.
ఇదికూడా చదవండి: రాజకీయాల కంటే పోలీస్ ఉద్యోగమే మంచిది..
నగర పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పాలికె ముఖ్య కమిషనర్‌తో కలిపి 21 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. నగరాభివృద్ధికి సంబంధించి మార్గదర్శకాలు చేస్తారు. రెండో విడతలో పాలికెలను నిర్వహిస్తారు. మూడో విడతలో వార్డు సభలు అస్థిత్వానికి రానున్నాయి. బెంగళూరు అభివృద్ధికి ప్రతినిధులుగా ప్రభుత్వం అన్ని సంస్థల సమన్వయంతో పనిచేసేలా ప్రాధికారకు మార్గదర్శకాలు చేయనుంది. పాతపద్ధతులను సమూలంగా మార్పులు చేసి కొత్త వ్యవస్థను తీసుకురానున్నారు. బిల్లులో 25 విభాగాలు, 169 పేజీలతో గ్రేటర్ బెంగళూరు అథారిటీ వివరించారు. ప్రతి కార్పొరేషన్ పరిధిలోనూ అక్కడి మేయర్, కమిషనర్, జాయింట్ కమిషనర్, స్థాయి సమితి, సర్కిల్ సమితి, వార్డు, ఏరియా సభలకు ఎక్కువ అధికారాలు ఇస్తారు.
ఇక స్థాయి సమితుల గరిష్టంగా 6కు మించరాదనే నిబంధన విధించారు. బీబీఎంపీలో 12 స్థాయి కమిటీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసి పాలికెలలో కేవలం 6 మాత్రమే ఉంటాయి. పాలనా వ్యవహారాలు, విద్య, సామాజిక న్యాయం, రెవెన్యూ, ఆర్థిక ఆడిట్, పబ్లిక్ వర్క్స్, ఇంజనీరింగ్ విభాగం, వైద్యం, విపత్తుల నిర్వహణ, అటవీ, పరిసరాలు, చెరువులు, ఉద్యానవనశాఖ, టౌన్‌ప్లానింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి కమిటీలో ఐదుగురు సభ్యులను నియమిస్తారు. కొత్తగా అస్థిత్వానికి వచ్చే పాలికె పరిధిలో అక్కడి నిబంధనల ఆధారంగా ఆస్తి పన్ను ఏర్పాటు చేసుకుంటారు. అదనంగా నిధుల సేకరణ కోసం వేర్వేరు విధాలుగా సెస్ వేసే అధికారం ఉంటుంది. ఆలస్యంగా పన్నులు చెల్లిస్తే 9 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది.
బీబీఎంపీలో ప్రస్తుతం ఏటా మేయర్, ఉపమేయర్‌ను ఎన్నుకునే విధానం ఉంది. గ్రేటర్ బెంగళూరు ప్రాధికార అయితే ఐదేళ్లకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక చేస్తారు. కార్పొరేటర్‌గా పోటీ చేసేవారి వయస్సు 21 సంవత్సరాలుగా నిర్ణయించారు. గ్రేటర్ బెంగళూరు అథారిటీలో కార్పొరేషన్, వార్డు కమిటీలు, మూడు విడతల పాలనా వ్యవస్థ ఉంటుంది. 10 లక్షల జనాభాకు తక్కువ కాకుండా ఉండేలా గరిష్టంగా 10 పాలికెలు ఉంటాయి. బెంగళూరు నగర, గ్రామీణ జిల్లా, ప్రభుత్వం నిర్దేశించిన ఇతర ప్రాంతాలు బీఎంఆర్‌డీఏ పరిధిలో ఉంటాయి. పాలికెలు ప్రభుత్వ సంస్థల సమన్వయం ద్వారానే పన్నులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రధాన కమిషనర్ పాలనా వ్యవహారాలను నిర్వహిస్తారు. మిగిలిన పాలికెలను సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. గ్రేటర్ బెంగళూరు ముఖ్య కమిషనర్ అధ్యక్షతన మూడు నెలలకోసారి పాలనా వ్యవస్థపై సమీక్షలు చేస్తారు.
ఆర్థిక వనరుల కోసం ప్రత్యేకంగా నగరాభివృద్ధిశాఖ మంత్రి నేతృత్వంలో ఆర్థిక అభివృద్ధి ఏజెన్సీ ఏర్పాటు కానుంది. పాలికెల ఆస్తుల రక్షణకు గ్రేటర్ బెంగళూరు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. పన్నుల నియంత్రణ, చెత్త పర్యవేక్షణ, నీరు, విద్యుత్, ఫ్లై ఓవర్‌ల నిర్మాణం, భారీ రోడ్ల నిర్మాణాలను కమిటీ నిర్ధారిస్తుంది. బడ్జెట్‌కు ఆమోదించి పాలికెలకు ఎక్కువ గ్రాంట్లు కేటాయించే అధికారం గ్రేటర్ బెంగళూరుకు ఉంటుంది. నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్తులు పాలికె పరిధిలోకి చేరుతాయి. పబ్లిక్ సర్వీస్ కోసం లీజ్ రూపంలో కేటాయించే అధికారం ప్రధాన కమిషనర్‌కు ఉంటుంది.
బృహత్ బెంగళూరు మహానగర పాలికెకు మరింతకాలం ఎన్నికలు లేనట్టేని తెలుస్తోంది. ఇప్పటికే పాలకవర్గం లేక దాదాపు మూడేళ్లు కావస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ బెంగళూరుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఎన్నికలు మరింత జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News