Share News

శివరాజ్‌ చేతికి సింగ్‌కు బీజేపీ పగ్గాలు?

ABN , Publish Date - Sep 30 , 2024 | 03:25 AM

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్థానంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

శివరాజ్‌ చేతికి సింగ్‌కు బీజేపీ పగ్గాలు?

  • ఆరెస్సెస్‌, పార్టీ వర్గాల మద్దతు

  • సుదీర్ఘ రాజకీయ, పాలన అనుభవం

  • సవాళ్లను ఎదుర్కోవడంలో దిట్టగా పేరు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్థానంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ అధ్యక్ష పదవికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(65) పేరును ఆర్‌ఎస్సె్‌సతో పాటు బీజేపీలోని పలు వర్గాలు సమర్థించినట్లు తెలుస్తోంది. ప్రశాంతంగా ఉండే తత్వం, రాజకీయ చతురతకు తోడు అసాధారణ మీడియా మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు ఉన్న ఆయన బలమైన పోటీదారుగా నిలిచారు.

మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శివరాజ్‌ సింగ్‌.. క్లిష్టమైన సవాళ్లను సైతం ఎదుర్కోగలనని నిరూపించుకున్నారని, అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న ఇతర నాయకుల్లో ఎవరికీ ఈ లక్షణాలు లేవని ఆరెస్సెస్‌ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఇప్పటివరకూ చర్చించిన నేతల్లో చౌహాన్‌ అత్యుత్తమ ఎంపికని, ఆయనకున్న ప్రజాదరణకు తోడు విస్తృతమైన అనుభవంతో పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపాయి. బీజేపీతో పాటు సంఘ్‌తో ఆయనకున్న దశాబ్దాల నాటి అనుబంధం కూడా పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. ఆరెస్సెస్‌లో అజాతశత్రువుగా పేరొందిన శివరాజ్‌కున్న పోరాడే తత్వం, శ్రేణుల్లో ఏకాభిప్రాయాన్ని సాధించే నేర్పు జాతీయ స్థాయిలో బీజేపీని నడిపించే నాయకుడికి ఉండాల్సిన కీలక నైపుణ్యాలని ఆరెస్సెస్‌ ప్రముఖుడు ఒకరు అభిప్రాయపడ్డారు.

Updated Date - Sep 30 , 2024 | 03:25 AM