Rajya Sabha Elections: కాంగ్రెస్ కొంప ముంచిన క్రాస్ ఓటింగ్.. హిమాచల్‌లో బీజేపీ విక్టరీ
ABN , Publish Date - Feb 27 , 2024 | 09:27 PM
హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక రాజ్యసభ స్థానానికి మంగళవారంనాడు ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలుపొందారు. కాంగ్రెస్ ప్రత్యర్థి అభిషేక్ మను సింఘ్విపై హర్ష్ మహాజన్ గెలుపొందారు.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) నుంచి ఏకైక రాజ్యసభ స్థానానికి మంగళవారంనాడు ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ (BJP) అభ్యర్థి హర్ష్ మహాజన్ (Harsh Mahajan) గెలుపొందారు. కాంగ్రెస్ ప్రత్యర్థి అభిషేక్ మను సింఘ్విపై హర్ష్ మహాజన్ గెలుపొందారు. క్రాస్ ఓటింగ్ (Cross voting) కాంగ్రెస్ (Congress) పార్టీ కొంపముంచింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో మొత్తం 68 ఓట్లలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇరువురుకి చెరో 34 ఓట్లు వచ్చాయి. దీంతో 'టాస్' ఆధారంగా గెలుపును నిర్ణయించారు. ఈ 'డ్రా'లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌ను గెలుపు వరించింది.
సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్
రాజ్యసభ ఎన్నికల్లో హర్ష్ మహాజన్ గెలుపుపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఉన్నప్పటికీ ఆ పార్టీ రాజ్యసభ సీటు గెలుచుకోలేకపోయిందని, హర్షవర్ధన్‌కు శుక్షాకాంక్షలని హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో విపక్ష నేత జయరాం ఠాకూర్ అన్నారు. కేవలం ఏడాదిలోనే సొంత పార్టీ ఎమ్మెల్యే సీఎంను విడిచిపెట్టేశారని, ఇందుకు బాధ్యత వహించి సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు క్రెడిట్ జేపీ నడ్డా, అమిత్‌షాకే దక్కుతుందన్నారు.