Share News

Pension : పింఛను ఇకపై ఎక్కడి నుంచైనా..

ABN , Publish Date - Sep 05 , 2024 | 05:25 AM

కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్‌ పింఛన్‌దారులకు శుభవార్త చెప్పింది. పింఛనుదారులు ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా పింఛను తీసుకునే వెసులుబాటు కల్పించింది.

Pension : పింఛను ఇకపై ఎక్కడి నుంచైనా..

  • ఈపీఎస్‌ పింఛనుదారులకు శుభవార్త

  • దేశంలో ఏ బ్యాంకు నుంచైనా పొందొచ్చు

  • కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థకు ఈపీఎఫ్‌వో

  • ఓకే; జనవరి 1 నుంచి అమల్లోకి..

  • దేశంలో ఎక్కడ, ఏ బ్యాంకు నుంచైనా తీసుకోవచ్చు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్‌ పింఛన్‌దారులకు శుభవార్త చెప్పింది. పింఛనుదారులు ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా పింఛను తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ బ్యాంక్‌ నుంచైనా పింఛను తీసుకునే వీలు కల్పించింది. ఈ మేరకు కేంద్రీకృత పింఛను చెల్లింపు వ్యవస్థ (సీపీపీఎ్‌స)ను తీసుకొచ్చేందుకు ఈపీఎ్‌ఫవో ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఈపీఎ్‌ఫవో ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మన్‌ మన్సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. 2025 జనవరి 1 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని తెలిపారు. దీనివల్ల 78 లక్షల మంది పింఛన్‌దారులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు. పింఛనుదారులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లినప్పుడు పింఛను పేమెంట్‌ ఆర్డర్‌ (పీపీవో)ను బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు.


  • సీపీపీఎ్‌సతో సమూల మార్పులు..

సీపీపీఎస్‌ ప్రస్తుత పింఛను పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం ఈపీఎ్‌ఫవో జోనల్‌/ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి. పింఛను ప్రారంభ సమయంలో పింఛనుదారులు ధ్రువీకరణ కోసం సంబంధిత బ్యాంకుకు వెళ్లాలి. కేంద్రీకృత విధానం వల్ల ఇకపై ఆ అవసరం తప్పుతుంది. పింఛను విడుదలైన వెంటనే, ఆ మొత్తం పింఛనుదారు ఖాతాలో జమవుతుంది. ఆధార్‌ చెల్లింపు వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు మాండవీయ చెప్పారు.

Updated Date - Sep 05 , 2024 | 05:25 AM