Share News

Central Government : వక్ఫ్‌ బోర్డుల అపరిమిత అధికారానికి చెక్‌!

ABN , Publish Date - Aug 05 , 2024 | 03:26 AM

వక్ఫ్‌ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సమాయత్తమైంది. ప్రధానంగా.. కనిపించిన ప్రతి భూమీ, ఆస్తీ తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్‌ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది.

Central Government : వక్ఫ్‌ బోర్డుల అపరిమిత అధికారానికి చెక్‌!

  • పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే సవరణ బిల్లు

  • 40 సవరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ, ఆగస్టు 4: వక్ఫ్‌ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సమాయత్తమైంది. ప్రధానంగా.. కనిపించిన ప్రతి భూమీ, ఆస్తీ తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్‌ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది. మరింత పారదర్శకత కోసం సదరు భూములు/ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది.

అలాగే వక్ఫ్‌ బోర్డుల్లో మహిళలకూ తప్పనిసరి చోటు కల్పిస్తూ వక్ఫ్‌ చట్టంలోని 9,14 సెక్షన్లను సవరించాలని ప్రతిపాదించింది. దాదాపు 40 సవరణలతో కూడిన సవరణ బిల్లును మోదీ కేబినెట్‌ ఇటీవల ఆమోదించింది.

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే దీనిని ప్రవేశపెట్టనుంది. వక్ఫ్‌ ఆస్తుల దుర్వినియోగానికి అరికట్టేందుకు వాటిపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని కేంద్రం తన బిల్లులో పేర్కొంది. వక్ఫ్‌ బోర్డులకు ప్రస్తుతం విస్తృత అధికారాలు ఉన్నాయి.

ఏదైనా భూమి/ఆస్తిని తమది ప్రకటించడం ద్వారా పలు వివాదాలకు, అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు 2022 సెప్టెంబరులో తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగం తాలూకా తిరుచెందురై గ్రామం మొత్తంపై తనకే హక్కు ఉందని తమిళనాడు వక్ఫ్‌ బోర్డు ప్రకటించింది. కావేరీ తీరాన ఉన్న సుప్రసిద్ధ చంద్రశేఖరస్వామి ఆలయం, దాని భూములు కూడా తనవేనని పేర్కొంది.

ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు వెళ్లినప్పుడు.. వక్ఫ్‌ బోర్డు నుంచి ఎన్‌వోసీ తీసుకురావాలని తిరుచిరాపల్లి జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ స్పష్టం చేశారు. దీనిపై గ్రామస్తులు మండిపడ్డారు.

జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దఎత్తున నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. దరిమిలా ఓ రెవెన్యూ అధికారి ప్రాథమిక విచారణ నిర్వహించారు. అనంతరం క్రయవిక్రయాలను ఎప్పటిలాగే కొనసాగించాలని నిర్ణయించారు.

ఇలాంటి వివాదాలను అరికట్టేందుకు కేంద్రం చట్ట సవరణలకు ఉపక్రమించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పైగా వక్ఫ్‌ బోర్డుల్లో తమకు చోటివ్వడం లేదని, చట్టంలో మార్పులు తీసుకురావాలని ముస్లిం మేధావులు, మహిళలు, షియాలు, బొహ్రా ముస్లింలు చాలాకాలంగా కోరుతున్నారు.

హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ల్లో అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. జమ్మూకశ్మీరులో కూడా ఎన్నికల సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం వక్ఫ్‌ చట్టానికి సవరణలు చేపట్టాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - Aug 05 , 2024 | 03:26 AM