Share News

CM Stalin : గవర్నర్‌ను వెంటనే రీకాల్‌ చేయండి

ABN , Publish Date - Oct 19 , 2024 | 03:43 AM

తమిళనాడు గవర్నర్‌ను వెంటనే రీకాల్‌ చేయాలని సీఎం స్టాలిన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

CM Stalin : గవర్నర్‌ను వెంటనే రీకాల్‌ చేయండి

  • కేంద్రానికి స్టాలిన్‌ డిమాండ్‌

రాష్ట్ర గేయంలోని ‘ద్రవిడ’ పదాన్ని ఉద్దేశపూర్వకంగా పలకలేదని ఆరోపణ

చెన్నై, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు గవర్నర్‌ను వెంటనే రీకాల్‌ చేయాలని సీఎం స్టాలిన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ రాష్ట్ర గేయంలోని ‘ద్రవిడ’ అనే పదాన్ని ఉద్దేశ పూర్వకంగానే పలకలేదని ఆయన ఆరోపించారు. ‘‘గవర్నర్‌ మీరు ఆర్యులా? ద్రవిడ అనే పదాన్ని తొలగించి రాష్ట్ర గేయాన్ని ఆలపించడం తమిళనాడు చట్టాలకు విరుద్ధం.

ఆ చట్టాలను గౌరవించని, ఇష్టానుసారం ప్రవర్తించే వ్యక్తి గవర్నర్‌ పదవిలో కొనసాగేందుకు అర్హుడు కాదు. దేశంలో నివసిస్తున్న వివిధ జాతులు, మతాలకు చెందిన ప్రజల ఐక్యతను దెబ్బతీసేలా గవర్నర్‌ ప్రవర్తించారు’’ అని స్టాలిన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ద్రవిడియన్‌ అలర్జీతో బాధపడుతున్న గవర్నర్‌ జాతీయ గీతంలో ద్రవిడ పదాన్ని తొలగించాలని కోరుతారా? ఉద్దేశపూర్వకంగా తమిళనాడును, తమిళనాడు ప్రజల మనోభావాలను కించపరుస్తున్న గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రీకాల్‌ చేయాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.

ఇదిలా ఉండగా, హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ మాసోత్సవాలు జరపడమెందుకని స్టాలిన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి శుక్రవారం లేఖ రాశారు. శుక్రవారం ఉదయం మద్రాస్‌ దూరదర్శన్‌ స్వర్ణోత్సవాలతో పాటు హిందీ మాసోత్సవాన్ని నిర్వహించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విభిన్న భాషలకు నిలయమైన భారతదేశంలో హిందీ భాషకు ప్రత్యేక స్థానం ఇవ్వడం, హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీమాసోత్సవాలను నిర్వహించడం ఆయా రాష్ట్రాల్లోని మాతృభాషలను, ఇతర భాషలను కించపరచడమే అవుతుందని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 03:44 AM