Share News

సెబీ చైర్మన్‌ మాధవికి ఏడేళ్లుగా ఐసీఐసీఐ నుంచీ జీతం!

ABN , Publish Date - Sep 03 , 2024 | 03:56 AM

సెబీ చీఫ్‌ మాధవి పురీపై కాంగ్రెస్‌ సంచలన ఆరోపణలు చేసింది. గతంలో సెబీ సభ్యురాలి హోదాలో, ప్రస్తుతం సెబీ చైర్మన్‌ హోదాలోనూ ఆమె ఐసీఐసీఐ నుంచి ఏడేళ్లుగా జీతం తీసుకుంటున్నారని ఆరోపించింది.

సెబీ చైర్మన్‌ మాధవికి ఏడేళ్లుగా ఐసీఐసీఐ నుంచీ జీతం!

  • 2017 నుంచి రూ.16.8 కోట్లు పొందారు.. ఇది సెబీ చట్టంలోని సెక్షన్‌ 54 ఉల్లంఘనే

  • సెబీ చైర్‌పర్సన్‌, సభ్యులను ప్రధాని ఆధ్వర్యంలోని కమిటీ నియమిస్తుంది

  • అందుకే మోదీ స్పందించాల్సిందే: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: సెబీ చీఫ్‌ మాధవి పురీపై కాంగ్రెస్‌ సంచలన ఆరోపణలు చేసింది. గతంలో సెబీ సభ్యురాలి హోదాలో, ప్రస్తుతం సెబీ చైర్మన్‌ హోదాలోనూ ఆమె ఐసీఐసీఐ నుంచి ఏడేళ్లుగా జీతం తీసుకుంటున్నారని ఆరోపించింది. సెబీలో చేరాక 2017 నుంచి ఇప్పటిదాకా ఆమె ఐసీఐసీఐ నుంచి రూ.16.8 కోట్ల మేర పొందారని.. ఈ మొత్తం, సెబీ నుంచి ఆమె తీసుకుంటున్న జీతానికి ఐదు రెట్లు ఎక్కువ అని పేర్కొంది. ఇది సెబీ యాక్ట్‌ (ఎంప్లాయీ సర్వీ్‌స)లోని 54 సెక్షన్‌ను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. 2017 ఏప్రిల్‌ 5న ఆమె సెబీ పూర్తి స్థాయి సభ్యురాలయ్యారని.. అప్పటి నుచి ఐసీఐసీఐ సంస్థ నుంచి కూడా ఆమె జీతం పొందుతున్నారని కాంగ్రెస్‌ పేర్కొంది. సెబీ చైర్‌పర్సన్‌, సభ్యులను ప్రధాని ఆధ్వర్యంలోని ఓ ప్రత్యేక కమిటీ నియమిస్తుందని అందుకే ఈ ఘటనపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.

ఈ విషయమ్మీద కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖెరా ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. సెబీ సభ్యురాలి హోదాలో, సెబీ చైర్‌పర్సన్‌ హోదాలోనూ మాధవి పూరీ ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 2016-2021 దాకా రూ.12.63 కోట్ల మేర జీతం తీసుకున్నారని.. 2017-24 మధ్య ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నుంచి రూ.22.41 లక్షలను జీతంగా తీసుకున్నారని, 2021-23 మధ్య ఐసీఐసీఐ ఈఎ్‌సవోపీ (ఎంప్లాయి స్టాక్‌ ఆప్షన్‌ ప్లాన్‌) నుంచి రూ.2.84 కోట్లు పొందారని, 2021-23 మధ్య ఐసీఐసీఐ నుంచి 1.10 కోట్ల మేర టీడీఎస్‌ మినహాయింపులు పొందారని ఆరోపించారు.


కాగా సెబీ చైర్‌పర్సన్‌గా ఉన్న మాధవి, ఐసీసీఐ బ్యాంకు నుంచీ జీతం తీసుకుంటున్నారన్న విషయం ప్రధాని మోదీకి తెలుసా? అని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. అదానీ గ్రూప్‌ సంస్థల మీద సెక్యూరిటీల చట్టం ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తును సుప్రీంకోర్టు సెబీకి అప్పగించడంతో సెబీ చైర్‌పర్సన్‌గా మాధవి పురీ పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.. కాగా కాంగ్రెస్‌ ఆరోపణలను ఐసీఐసీఐ ఖండించింది. మాధవి 2013 అక్టోబరు 31న ఉద్యోగ విరమణ చేశాక ఆమెకు ఎలాంటి జీతం గానీ, ఈఎ్‌సఓపీ ప్రయోజనాలు గానీ ఇవ్వలేదని స్పష్టం చేసింది.

Updated Date - Sep 03 , 2024 | 03:56 AM