CSDS-Lokniti: సీఎస్డీఎస్ లోక్‌నీతి సంచలన సర్వే.. ఓటర్ల మనోగతమిదే..!
ABN , Publish Date - Apr 12 , 2024 | 07:29 AM
లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) ఓటర్లు ఓటు వేయడానికి ప్రాతిపదికగా తీసుకునే ప్రధాన అంశాలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి అని ‘సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్(సీఎస్డీఎస్) లోక్‌నీతి’(CSDS-Lokniti) నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో(Pre Poll Survey) వెల్లడైంది. బీజేపీ(BJP) ఆశలు పెట్టుకున్న రామమందిరం(Ram Mandir) అంశానికి ఓటర్లు పెద్దగా..
ఆలయం కాదు.. ఆదాయం ముఖ్యం
సీఎస్డీఎస్ లోక్‌నీతి ప్రీపోల్ సర్వేలో ఓటర్ల మనోగతం
నిరుద్యోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్న 27 శాతం మంది
రామమందిరానికి 8% మంది మాత్రమే ఓటు
ధరల పెరుగుదలపైనా జనంలో ఆగ్రహం
నిమ్నాదాయ వర్గాల్లో కేంద్రంపై అసంతృప్తి
ఉన్నత, మధ్య తరగతి ప్రజల్లో సానుకూలత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) ఓటర్లు ఓటు వేయడానికి ప్రాతిపదికగా తీసుకునే ప్రధాన అంశాలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి అని ‘సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్(సీఎస్డీఎస్) లోక్‌నీతి’(CSDS-Lokniti) నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో(Pre Poll Survey) వెల్లడైంది. బీజేపీ(BJP) ఆశలు పెట్టుకున్న రామమందిరం(Ram Mandir) అంశానికి ఓటర్లు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఈ సర్వే తెలిపింది. అంతేకాదు, అవినీతి అంశాన్ని కూడా జనం అంతగా పట్టించుకోవటం లేదని పేర్కొంది. సీఎస్డీఎస్ లోక్‌నీతి నిర్వహించిన ప్రీపోల్ సర్వే ఫలితాలను గురువారం వెల్లడించారు. భారత్‌లో నిరుద్యోగం పెరిగిపోతోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదిక ఇప్పటికే హెచ్చరించగా.. సీఎస్డీఎస్ సర్వే ఫలితాలు కూడా దీనిని బలపరిచేలా ఉన్నాయి. నిరుద్యోగం తమను తీవ్రంగా ఆందోళనపరుస్తున్న అంశమని సర్వేలో పాల్గొన్న వారిలో పలువురు చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా
సీఎస్డీఎస్ లోక్‌నీతి ఇదే తరహా సర్వే జరుపగా.. నిరుద్యోగం ముఖ్యమైన అంశమని 11 శాతం మంది మాత్రమే చెప్పారు. ప్రస్తుత సర్వేలో ఈ సంఖ్య 27 శాతానికి పెరిగింది. తమకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని.. సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది స్పష్టం చేశారు. చదువుకున్న యువతీ యువకులలో చాలామంది నిరుద్యోగం తీవ్రమైన సమస్య అని చెప్పగా, అంతగా చదువుకోని వ్యక్తులు ధరల పెరుగుదలను ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. మూడింట రెండొంతుల మంది గత ఐదేళ్లతో పోల్చితే ధరలు పెరిగాయని తెలిపారు. ముఖ్యంగా పేదలు, గ్రామీణ ప్రాంత వాసులు దీని గురించి అధికంగా ప్రస్తావించారు. ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభత్వాల కన్నా కేంద్రప్రభుత్వమే ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుందని సర్వేలో పాల్గొన్న వారిలో పలువురు చెప్పటం గమనార్హం. గత ఐదేళ్లలో తమ జీవితాలు ఎంతోకొంత మెరుగుపడ్డాయని దాదాపు సగం మంది భావించగా, మూడోవంతు మంది మాత్రం తమ జీవితం మరిన్ని సమస్యలతో అధ్వానంగా తయారైందని చెప్పారు. ఆర్థికంగా దిగువశ్రేణిలో ఉన్న ప్రజల్లో ఎక్కువ మంది.. తమ జీవితాల్లో మంచి రోజులు రాలేదని స్పష్టం చేశారు. ఉన్నతాదాయ వర్గాలు, మధ్యతరగతి ప్రజలు ఆదాయం పెరిగిందని, జీవన పరిస్థితులు మెరుగయ్యాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు, పథకాల వల్ల సంపన్నులకే మేలు జరిగిందని దాదాపు 8 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాగా, సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 8 శాతం మంది మాత్రమే రామమందిరం, అవినీతి అంశాలను ఓటు వేయటానికి అత్యంత ముఖ్యమైన విషయాలుగా పేర్కొన్నారని సీఎస్డీఎస్ లోక్‌నీతి తెలిపింది.