Delhi : దేశంలో ఎంపాక్స్ అనుమానిత కేసు
ABN , Publish Date - Sep 09 , 2024 | 03:59 AM
ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడికి ఎంపాక్స్(మంకీ ఫీవర్) సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల విదేశం నుంచి వచ్చిన యువకుడిలో లక్షణాలు
ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్న కేంద్రం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడికి ఎంపాక్స్(మంకీ ఫీవర్) సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రోగిని ఓ ఆస్పత్రిలో ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారని, అతని పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపింది. అతను విదేశాల నుంచి వచ్చాక ఎవరెవరిని కలిశాడో వారిని గుర్తిస్తున్నారని(కాంటాక్ట్ ట్రేసింగ్) వివరించింది. రోగి నుంచి సేకరించిన స్వాబ్ నమూనాలను టెస్టింగ్‌కు పంపించారు. అతనిలో ఎంపాక్స్ లక్షణాలు స్పష్టంగా ఉండటంతో రిజల్ట్ పాజిటివ్‌గా వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు, దేశంలో ఎంపాక్స్ విస్తరించకుండా కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని ఆరోగ్యశాఖ తన ప్రకటనలో తెలిపింది.
అయితే, రోగి వివరాలు, అతన్ని ఎక్కడ ఐసొలేషన్‌లో ఉంచారన్న వివరాలను కేంద్రప్రభుత్వం వెల్లడించలేదు. కాగా, ఎంపాక్స్ ఇటీవలి కాలంలో ఆఫ్రికా ఖండ దేశాల్లో విజృంభించింది. ఆ ఖండం నుంచి స్వీడన్, థాయ్‌లాండ్ దేశాలకూ పాకింది. ప్రజారోగ్యం పరంగా ఎంపాక్స్ అంతర్జాతీయంగా ఆందోళనకరస్థాయిలో విస్తరిస్తోందని(పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ) డబ్ల్యూహెచ్‌వో గత నెలలో ప్రకటించింది. ఇదిలా ఉండగా, భారత్‌లో గతంలోనూ ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది మార్చి తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదు