Share News

Delhi : కేంద్ర-రాష్ట్రాల మధ్య వారధిగా గవర్నర్లు

ABN , Publish Date - Aug 03 , 2024 | 04:41 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమర్థవంతమైన వారధి నిర్మించేందుకు గవర్నర్లు కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు.

Delhi : కేంద్ర-రాష్ట్రాల మధ్య వారధిగా గవర్నర్లు

  • గిరిజనుల సంక్షేమానికి కృషి చేయాలి

  • ఢిల్లీలో గవర్నర్ల సదస్సులో మోదీ పిలుపు

న్యూఢిల్లీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమర్థవంతమైన వారధి నిర్మించేందుకు గవర్నర్లు కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. అణగారిన వర్గాలకు న్యాయం లభించే విధంగా ప్రజలు, సామాజిక సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు.

గవర్నర్‌ పదవి రాజ్యాంగ పరిధిలోనే ప్రజలకు సేవ చేసేందుకు ఏర్పర్చిన ముఖ్యమైన వ్యవస్థ అని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రజల ప్రయోజనాలకు గవర్నర్లు తోడ్పడాలని చెప్పారు. గవర్నర్ల సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.....జాతీయ లక్ష్యాలు సాధించేందుకు తోడ్పడాలని గవర్నర్లకు పిలుపునిచ్చారు.

కేంద్ర రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేసేందుకే కాక, సామాన్యులకు సంక్షేమ కార్యక్రమాలు చేరేందుకూ కృషి చేయాలన్నారు. క్రిమినల్‌ న్యాయవ్యవస్థకు సంబంధించిన కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ఆమె చెప్పారు. ప్రజాస్వామ్యం సాఫీగా పనిచేయాలంటే కేంద్ర ఏజెన్సీలు అన్ని రాష్ట్రాల్లో సమన్వయంతో పనిచేయాలని, ఇందుకు ఏ విధంగా కృషి చేయాలో రాజ్యాంగాధినేతలుగా గవర్నర్లు సూచించాలని ఆమె కోరారు.

రాష్ట్రాల్లో చాన్సలర్లుగా కూడా గవర్నర్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్నందువల్ల నూతన విద్యావిధానం సూచించిన సంస్కరణలు అమలు అయ్యేలా చూడాలని సూచించారు. సహజ వ్యవసాయ విధానాలను పెంపొందించేందుకు రాజ్‌భవన్లు మార్గదర్శకం కావాలని చెప్పారు.

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంఖడ్‌, హోంమంత్రి అమిత్‌షా కూడా రెండు రోజుల సదస్సులో తొలిరోజు ప్రసంగించారు. అభివృద్ది పనులకు ఊతం ఇచ్చేందుకు ఆశావహ జిల్లాలు, చైతన్యవంతమైన గ్రామాలను సందర్శించాలని అమిత్‌ షా....గవర్నర్లను కోరారు.

Updated Date - Aug 03 , 2024 | 04:42 AM