Share News

Delhi : ఇస్రో బంగారు బాతు!

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:25 AM

ఇస్రో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేరాఫ్‌ అడ్రస్‌. ఇతర దేశాల కంటే తక్కువ ఖర్చులోనే రాకెట్‌ ప్రయోగాలు చేపడుతూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

Delhi : ఇస్రో బంగారు బాతు!

  • ప్రతి రూపాయికీ 2.54 రెట్లు రాబడి

  • అంతరిక్ష రంగంలో భారత్‌ ఘన విజయం

  • ఫ్రాన్స్‌కు చెందిన ‘నోవాస్పేస్‌’ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఇస్రో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేరాఫ్‌ అడ్రస్‌. ఇతర దేశాల కంటే తక్కువ ఖర్చులోనే రాకెట్‌ ప్రయోగాలు చేపడుతూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అదే సమయంలో భారీ లాభాలను కూడా ఆర్జిస్తోంది.

ఇస్రోపై పెట్టుబడిగా వెచ్చించిన ప్రతి రూపాయికీ 2.54 రెట్లు రాబడిగా వస్తోందని తాజా నివేదికలో వెల్లడైంది. ఫ్రాన్స్‌కు చెందిన నోవాస్పేస్‌ అనే సంస్థ ‘సోషియో-ఎకనామిక్‌ ఇంపాక్ట్‌ అనాలసిస్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌’ పేరిట ఈ నివేదికను రూపొందించింది. గ్లోబల్‌ టెండరింగ్‌ ప్రక్రియలో భాగంగా ఇస్రో ఈ నివేదికను రూపొందించే బాధ్యతను నోవాస్పే్‌సకు అప్పగించింది.

ఇస్రో ఈ తరహా అధ్యయనం చేపట్టడం ఇదే తొలిసారి. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను శుక్రవారం విడుదల చేశారు. దీని ప్రకారం.. ఇస్రో సుమారు రూ.5లక్షల కోట్ల ఆర్థిక ప్రయోజనాలు, 47 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. దీంతోపాటు రూ.2లక్షల కోట్ల విలువైన పన్ను ఆదాయాన్ని తీసుకొచ్చింది.


2014-2023 మధ్యకాలంలో భారత అంతరిక్ష రంగం జోడించిన స్థూల విలువ రూ.5లక్షల కోట్లు కాగా, వచ్చే పదేళ్లలో ఇది రూ.7.5లక్షల కోట్ల నుంచి రూ.11 లక్షల కోట్ల వరకూ పెరగొచ్చని తాజా నివేదిక అంచనా వేసింది. కాగా, అంతరిక్ష రంగంలో భారత్‌ ఘన విజయం సాధించిందని నోవాస్పే్‌సకు చెందిన నిపుణుడు స్టీవ్‌ బొషింగర్‌ అన్నారు.

గత 55 ఏళ్లలో ఇస్రోపై భారత ప్రభుత్వం చేసిన ఖర్చు అమెరికాకు చెందిన నాసా ఏడాది బడ్జెట్‌ కంటే చాలా తక్కువేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇస్రో వార్షిక బడ్జెట్‌ రూ.13 వేల కోట్లని, నాసా వార్షిక బడ్జెట్‌ దీనికంటే 15.5 రెట్లు అధికమని పేర్కొన్నారు.

కాగా, జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చంద్రయాన్‌-3 మిషన్‌ నుంచి సేకరించిన సైంటిఫిక్‌ డేటాను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. దీన్ని ప్రదాన్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ పేర్కొన్నారు.


మరోవైపు, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి పృథ్వీ-2 కచ్చితత్వంలో మరోసారి సత్తా చాటింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్‌కు రాత్రి సమయంలో నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. ఒడిసా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి గురువారం రాత్రి 7:46 గంటలకు డీఆర్‌డీవో సీనియర్‌ అధికారుల ఆధ్వరంలో దీన్ని పరీక్షించారు.

  • ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం

చంద్రయాన్‌-3 సాధించిన ఘన విజయానికి ఏడాది పూర్తైన సందర్భంగా చేపట్టిన జాతీయ అంతరిక్ష దినోత్సవం వేడుకలను భారత్‌ ఘనంగా నిర్వహించింది. దీన్ని పురస్కరించుకుని ఇస్రో ఢిల్లీలో శుక్రవారం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేసిన ఆయన.. చంద్రయాన్‌-3 విజయంతో ఇస్రో దేశం గర్వించేలా చేసిందని ప్రశంసించారు.

Updated Date - Aug 24 , 2024 | 03:25 AM