Delhi : ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ కమిటీ భేటీ
ABN , Publish Date - Aug 25 , 2024 | 05:08 AM
దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలే అజెండాగా ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ సంక్షేమ కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమైంది.
హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు
న్యూఢిల్లీ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలే అజెండాగా ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ సంక్షేమ కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమైంది.
ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న టీడీపీ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు సమావేశానికి హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి తీసుకోవలసిన చర్యలు, వారికి ప్రభుత్వం ఏ మేరకు మేలు చేయగలదన్న అంశాలపై సమావేశంలో సమీక్షించారు. ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీలకు ఏ మేరకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లను వర్తింపజేస్తున్నారు?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా శాఖల్లో రోస్టర్ విధానం అమలవుతోందా? లేదా? అన్న విషయాలపై కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల వివరాలను సేకరించి, దానికి అనుకూలంగా ప్రణాళికను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు ఎంపీ ప్రసాదరావు తెలిపారు.
బ్యాంకుల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రుణాలు తప్పకుండా మంజూరు చేయాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరువ చేయాలని, ప్రభుత్వ ఆశయాన్ని గౌరవించాలని బ్యాంకులకు ఆయన సూచించారు.